Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఎమ్మెల్సీ తాతా మధుపై కాంగ్రెస్ శ్రేణుల ఫైర్.. హసన్పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ఎమ్మెల్సీ తాతా మధుపై కాంగ్రెస్ శ్రేణుల ఫైర్.. హసన్పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Share Short Clip Download PDF

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ హసన్పర్తి మండల, డివిజన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో.. దళిత సమాజాన్ని అవమానించిన తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాయకులు హసన్పర్తి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హసన్ పర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రేణుకంట్ల అశోక్ కుమార్, గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, 65వ డివిజన్ అధ్యక్షులు నేదునూరి సునీల్, 2వ డివిజన్ అధ్యక్షులు పుట్ట తిరుపతి తదితరులు ఈ ర్యాలీకి నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..

రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని మంటగలపడమేనని నాయకులు మండిపడ్డారు. ఒక అట్టడుగు వర్గానికి చెందిన దళిత బిడ్డ శాసనసభ స్పీకర్‌గా ఉన్నారనే అక్కసుతోనే కేసీఆర్ సభకు రాకుండా ఉంటున్నారని, తాతా మధు వ్యాఖ్యలకు కేసీఆర్ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి దళిత ప్రజాప్రతినిధుల ఓట్లు తీసుకున్న తాతా మధు.. నేడు అదే దళిత సమాజానికి చెందిన ప్రజాప్రతినిధిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ అహంకారానికి నిదర్శనమని అశోక్ కుమార్ విమర్శించారు. దళితులను అవమానించడం బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతిగా మారిందా? అని ప్రశ్నించారు.

క్షమాపణ చెప్పకపోతే భారీ ఆందోళనలు:

తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, దళిత సమాజానికి మరియు స్పీకర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దళిత సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, వెంటనే తాతా మధును సస్పెండ్ చేయాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
అనంతరం ర్యాలీగా వెళ్లిన నాయకులు హసన్పర్తి పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ సమర్పించి, తాతా మధుపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.

ఎమ్మెల్సీ తాతా మధుపై కాంగ్రెస్ శ్రేణుల ఫైర్.. హాసన్ పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు