హనుమకొండ జిల్లాకు సంబంధించి సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్‌ బాజ్‌పాయి మంగళవారం అదనపు కలెక్టర్ ఎన్. రవి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపట్టే త్రైమాసిక తనిఖీలో భాగంగా గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత, స్ట్రాంగ్‌రూమ్‌ల పరిస్థితి, స్ట్రాంగ్ రూముకు వేసి ఉన్న సీళ్లను క్షుణ్ణంగా కలెక్టర్ పరిశీలించారు. భద్రతకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నిరంతర నిఘా వ్యవస్థలో భాగంగా గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతా ప్రమాణాలు పకడ్బందీగా అమలుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌ల సీళ్లు, తాళాలు, ప్రవేశ–నిష్క్రమణ విధానం, సీసీ కెమెరాల నిఘా వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా హనుమకొండ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ నుండి ఈ.వి. శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నుండి బి. ప్రవీణ్ కుమార్, బిజెపి నుండి నర్మెట శ్రీనివాస్, టిడిపి నుండి కుసుమ శ్యాంసుందర్, వైఎస్ఆర్సిపి నుండి నాగబెల్లి రజినీకాంత్, బీఎస్పీ నుండి అంబాల ప్రశాంత్, ఏఐఎంఐఎం నుండి సయ్యద్ ఫైజుల్లా, సిపిఎం నుండి జి. వెంకట్, తదితరులు పాల్గొన్నారు.