హనుమకొండలోని స్కానింగ్ , డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకాజీ కాలనీ లోని మెప్సన్ డయాగ్నస్టిక్ సెంటర్, న్యూ విజన్ దయాగ్నస్టిక్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మెప్సన్ డయాగ్నస్టిక్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ అందులోని అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ గదులను పరిశీలించారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ స్కానింగ్ కేంద్రంలో వివిధ రకాల స్కానింగ్ పరీక్షలకు సంబంధించిన ధరల వివరాలను తెలిపే పట్టిక కింద పెట్టి ఉండటంతో స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్ ప్రశ్నించారు.
స్కానింగ్ పరీక్షల ధరలు పట్టికను స్కానింగ్ కోసం వచ్చే ప్రజలకు స్పష్టంగా తెలిసేలా నిబంధనల మేరకు పెట్టించాలన్నారు. అదేవిధంగా న్యూ విజన్ డయాగ్నస్టిక్స్ సెంటర్ ను తనిఖీ సందర్భంగా తాళం వేసి ఉండటంతో అక్కడి అండర్ గ్రౌండ్ (సెల్లార్ )ను పరిశీలించారు.
ఈ రెండు డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు బిల్డింగ్ ప్లాన్ ప్రకారం పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాలను డయాగ్నస్టిక్ కు ఉపయోగిస్తుండడంతో నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. అప్పయ్యను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
పార్కింగ్ కోసం అనుమతించిన ప్రదేశాలను ఎవరు కూడా ఇతర అవసరాలకు వినియోగించకూడదన్నారు. ధరల పట్టికను మరియు సేవలందిస్తున్న డాక్టర్ ల వివరాలను ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి క్లినిక్ ,ఆసుపత్రి డయాగ్నొస్టిక్ సెంటర్లు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ,పిసిపిఎన్డిటి చట్టం నియమాలను పాటించడంతో పాటుగా బయోమెడికల్ , మరియు కాలుష్య నియంత్రణ మండలి నియమాలను అనుసరించాలని సూచించారు.