రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట (Golden Hour) ఎంతో కీలకమని, ఈ సమయంలో గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని రహ్-వీర్‌గా గుర్తిస్తారని తెలిపారు. అర్హత పొందిన రహ్-వీర్‌కు రూ.25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ రహ్-వీర్ పథకం.. ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల నగదు బహుమతి: డీటీఓ శంకర్ నాయక్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహ్-వీర్ (Good Samaritan) పథకం గురించి జిల్లా ప్రజలు తెలుసుకోవాలని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
పౌరులు ఏం చేయాలి?
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నా, ప్రమాదాన్ని చూసినా పౌరులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాలని శంకర్ నాయక్ సూచించారు. బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం తమ వివరాలను ఆస్పత్రిలో ఇవ్వాలని తెలిపారు. అక్కడి నుంచి సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి, సహాయం చేసిన వ్యక్తి వివరాలతో పాటు ఏ ఆస్పత్రిలో బాధితుడిని చేర్పించారనే సమాచారాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే జిల్లా స్థాయి కమిటీ ద్వారా వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న రహ్-వీర్‌కు రూ.25,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తారని తెలిపారు.
రహ్-వీర్ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 134(ఎ) ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని ‘రహ్-వీర్’ గా పరిగణిస్తారని తెలిపారు.
రహ్-వీర్ పథకం ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టాన్ని తగ్గించడం, ప్రమాద సమయంలో బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు సామాన్య ప్రజలను ప్రోత్సహించడం అని శంకర్ నాయక్ వివరించారు.
అలాగే బాధితులకు సహాయం చేసే పౌరులకు ఎలాంటి పోలీస్ లేదా చట్టపరమైన ఇబ్బందులు లేకుండా రక్షణ కల్పించడం కూడా ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశాల్లో ఒకటని తెలిపారు.
సంవత్సరానికి ఐదు సార్లు అవకాశం
సంవత్సరానికి ఒక వ్యక్తికి (5) సార్లు మాత్రమే రహ్-వీర్ నగదు బహుమతి, ప్రశంసా పత్రం ఇస్తారు అని శంకర్ నాయక్ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం చేసి ప్రాణాలు కాపాడాలని కోరారు.
ఒక వ్యక్తి సమయానికి స్పందించి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడటమే కాకుండా, ఒక కుటుంబాన్ని విషాదం నుంచి రక్షించినవారవుతారని ఆయన అన్నారు. రహ్-వీర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డీటీఓ శంకర్ నాయక్ పేర్కొన్నారు.