Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం దేశానికే మార్గదర్శకం

ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం దేశానికే మార్గదర్శకం
Share Short Clip Download PDF

• కాషాగూడెంలో ‘ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్.

దేశంలోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించేందుకు 'ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ధర్మసాగర్ మండలం కాషాగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 'ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, కలెక్టర్ శంకుస్థాపన చేశారు. అనంతరం చిన్నారుల మధ్య కూర్చొని, వారితో ముచ్చటిస్తూ స్వయంగా అల్పాహారాన్ని వడ్డించి వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉదయాన్నే ఆకలితో ఉండకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించి ఈ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. వారంలో ఒక్కో రోజు ఒక్కో రకంగా పూరీ, బోండా, ఇడ్లీ, వడ, మిల్లెట్ ఉప్మా తదితర రుచికరమైన ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాం.
కాషాగూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 92 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలను అప్పర్ ప్రైమరీ పాఠశాలగా అప్‌గ్రేడ్ చేసి అదనపు తరగతి గదులు, ఉపాధ్యాయులను సమకూర్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. విద్యార్థుల సంఖ్య పెరిగితే మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తాను. అధికారులు, సర్పంచ్ కలిసి గ్రామంలో పర్యటించి ఇళ్లు లేని నిరుపేదల వివరాలు సేకరించాలి. రాష్ట్రంలో రెండు విడతల్లో సుమారు 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. పేదల సంక్షేమం కోసం 3.10 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రజలు రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును మద్యానికి తగలేయకుండా పిల్లల చదువులు, భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవాలి. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కాషాగూడెం పేరును 'కాసీం నగర్'గా మార్చాలని, జీపీ భవనం, సీసీ రోడ్ల కోసం రూ.20 లక్షలు మంజూరు చేయాలని కలెక్టర్ ని కోరుతున్నాను అని అన్నారు.

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ..

దేశంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఉదయాన్నే పాఠశాలకు వచ్చే పిల్లలు మధ్యాహ్నం వరకు ఆకలితో ఉండటం వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని గుర్తించే ఈ పథకానికి రూపకల్పన చేశారు. హరేకృష్ణ సంస్థ భాగస్వామ్యంతో ప్రతిరోజూ అత్యంత తాజా, పౌష్టికాహారాన్ని వేర్వేరు మెనూలతో విద్యార్థులకు అందిస్తున్నాం.
కాషాగూడెం పాఠశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన అప్‌గ్రేడేషన్ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి పంపిస్తాం. విద్యార్థులకు నూతన యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఉచితంగా అందిస్తున్నాం. పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి ప్రాథమిక స్థాయి నుంచే డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తున్నాం.
ప్రస్తుతం ప్రభుత్వం ఫౌండేషన్ లెర్నింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. విద్యార్థులు 5వ తరగతికి వచ్చేసరికి ఇంగ్లిష్, గణితం (కూడికలు, తీసివేతలు, గుణకారాలు) అంశాల్లో పూర్తి పట్టు సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేకంగా రెమెడియల్ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థికి పునాది విద్య బలంగా ఉండేలా చూడటమే మా ప్రధాన లక్ష్యం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సయ్యద్ సత్తార్, డీఈవో గిరిరాజ్ గౌడ్, తహసిల్దార్ బావ్ సింగ్, ఎంపీడీవో అనిల్ కుమార్, ఎంఈఓ శ్రీదేవి, పాఠశాల హెచ్‌ఎం యాస్మిన్ జహాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం దేశానికే మార్గదర్శకం
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం దేశానికే మార్గదర్శకం