తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ వ్యవసాయ భూమిలోకి కొందరు చొరబడి పంటను ధ్వంసం చేయడంతో పాటు పొలంలో సీసా ముక్కలు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామానికి చెందిన మహిళా రైతు బండారి విమల ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చెందిన వ్యవసాయ భూమిలో ఇటీవల వరి నాట్లు వేసుకున్నామని, అయితే రాత్రికి రాత్రే గుర్తుతెలియని వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి పంటను ట్రాక్టర్‌తో తొక్కించి నాశనం చేశారని ఆమె ఆరోపించారు.

అంతటితో ఆగకుండా పొలంలో సీసా ముక్కలు చల్లడంతో మళ్ళీ నాటు వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని, మళ్ళీ పొలం ఎలా చదును చేసుకోవాలో అర్ధం కావడం లేదని, తమ కుటుంబం తరతరాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ వస్తోందని, ఇటీవల కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూమిపై కన్నేసి వివాదానికి కారణమవుతున్నారని విమల ఆరోపించారు. తమకు తెలియకుండా భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని, ఈ విషయంపై ప్రశ్నించినందుకు తమపై దాడికి సైతం పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.