Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

బీసీ సంక్షేమానికి ప్రాధాన్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

• రూ. 60 కోట్లతో 50 వేల మందికి కాటమయ్య రక్షణ కవచాలు.

బీసీ సంక్షేమానికి ప్రాధాన్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Share Short Clip Download PDF

• రూ. 450 కోట్లతో 1.30 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు జమ.

• నవంబర్ నుంచి 'రాజీవ్ యువ వికాసం' ప్రారంభం... ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు అక్టోబర్ 15 వరకు పెంపు.

హైదరాబాద్ (రైట్స్ మీడియా): రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బాలామాయదేవి, ఎంజేపీ సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, పద్మ, ఇందిరా, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1.30 లక్షల మంది విద్యార్థులకు ₹450 కోట్లు జమ

ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే (DBT పద్ధతి ద్వారా) జమ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ నూతన విధానం ద్వారా ఇప్పటివరకు 1,30,000 మంది విద్యార్థులకు ₹450 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అలాగే హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను సైతం ఏ నెలకు ఆ నెల ఖచ్చితంగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు.

₹60 కోట్లతో 'కాటమయ్య రక్షణ కవచాలు'

గీత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన 'కాటమయ్య రక్షణ కవచాలు' పథకం కింద ఇప్పటివరకు 50 వేల మందికి కిట్స్ మంజూరు కాగా, ఇప్పటికే 40 వేల కిట్లను అందించినట్లు వివరించారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికి కూడా శిక్షణ పూర్తయ్యాక కాటమయ్య రక్షణ కవచం కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం మొత్తం ₹60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
నవంబర్‌లో 'రాజీవ్ యువ వికాసం'
రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉన్నతి కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను సూచించారు.

ఎంజేపీ గురుకులాల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్

ఎంజేపీ (మహాత్మా జ్యోతిబా పూలే) గురుకులాల్లో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. గురుకుల విద్యాలయాలకు స్వంత భవనాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేయగా, ఆ అంశాన్ని పరిశీలిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు గడువు పెంపు

ఈ ఏడాది ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద మొదటి, రెండవ విడతల (ఇన్‌స్టాల్‌మెంట్స్) రూపంలో 180 మంది విద్యార్థులకు ₹18 కోట్ల 40 లక్షల నిధులను విడుదల చేశామని చెప్పారు. అర్హులైన విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

అదేవిధంగా, బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.