బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. జూన్, 2026తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి బ్యాంకర్ల పనితీరును సమీక్షించడానికి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ (DCC) మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) సమావేశాన్ని అదనపు కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణాలు ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రాధాన్యతా రంగాలు ఎంఎస్‌ఎంఈ, గృహనిర్మాణ రుణాలు, విద్యా రుణాలు, పునరుత్పాదక ఇంధన రుణాలు, ప్రభుత్వ రాయితీ పథకాలు పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, పీఎం విశ్వకర్మ రుణాల లక్ష్యాలు, సాధించిన ప్రగతిని బ్యాంకుల వారీగా సమీక్షించారు.
బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి: అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
పెండింగ్‌లో ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ దరఖాస్తులను వెంటనే అర్హులైన రైతులకు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. మహిళా సంఘాల రుణాలకు సంబంధించి ఎన్పీఏ తగ్గించే దిశగా బ్యాంకర్లు, డీఆర్డీఏ, మెప్మా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.పెండింగ్‌లో ఉన్న ఎస్ హెచ్ జీ రుణాలను తక్షణమే పంపిణీ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముజాహిద్, మెప్మా పీడీ నళిని, డీపీఎం అంజనేయులు, ఆర్బీఐ ఎల్డీఓ వెన్న శ్రీనివాస్, నాబార్డ్ డీడీఎం సుజిత్, ఎల్డీఎం ఎ. రవిప్రసాద్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.