హైదరాబాద్(రైట్స్ మీడియా): హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు: హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు. నేడు గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, భక్తి పారవశ్యంతో నిర్వహించాలని మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.
నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు, పోలీసు సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తంగా ఉంచిందని మంత్రి తెలిపారు. నిమజ్జన మార్గాలు, ట్రాఫిక్, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాల్లో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, గణేష్ మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మండపాలకు విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.
భక్తులు, మండపాల నిర్వాహకులు అధికారులకు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. ఎక్కడా ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భక్తులంతా సంతోషంగా, సురక్షితంగా గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ, ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ, మండపాల నిర్వాహకులందరికీ ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు. పోలీస్, GHMC, రెవెన్యూ, విద్యుత్, ట్రాఫిక్, హైడ్రా, జలమండలి, వైద్య, రవాణా తదితర శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. నిమజ్జన మార్గాలు, ట్యాంక్‌బండ్, ప్రధాన చెరువులు, నిమజ్జన ప్రాంతాలు, ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందస్తు చర్యలు చేపట్టామని, అవసరమైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తూ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నామని చెప్పారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్రకు దాదాపు 20 వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని, నిమజ్జన మార్గాలపై నిరంతర నిఘా కోసం 10 వేల CCTV కెమెరాలు, 24 డ్రోన్లను వినియోగిస్తున్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, చైన్ స్నాచింగ్, దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను రంగంలోకి దించామని స్పష్టం చేశారు. భక్తుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని, భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
భక్తుల సౌకర్యార్థం ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో ప్రత్యేక వాటర్ క్యాంపులు, తాగునీరు, వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిమజ్జన మార్గాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం GHMC ఆధ్వర్యంలో గణేష్ యాక్షన్ టీమ్స్, వేలాది మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశామని వివరించారు. బేబీ పాండ్లు, ప్రధాన చెరువులు, సరస్సుల వద్ద 110 స్టాటిక్ క్రేన్లు, 170 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశామని, పోలీస్ శాఖ సమన్వయంతో 12 జాయింట్ కంట్రోల్ రూమ్‌లలో సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు.
నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో ప్రతి 3- 4 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 136 గణేష్ యాక్షన్ టీమ్స్ (GATs) ఏర్పాటు చేశామని, నిమజ్జన ప్రాంతాల్లో 24 గంటల పాటు 770 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లో ఉంచామని తెలిపారు. చెత్త తొలగింపు కోసం గణేష్ యాక్షన్ టీమ్స్‌తో పాటు 6,000 మంది స్వీపింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నామని, నిమజ్జన ప్రాంతాలు, ఊరేగింపు మార్గాల్లో 287 మొబైల్ టాయిలెట్లను 24 గంటల పాటు అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
చెరువులు, బేబీ పాండ్లు, ఊరేగింపు మార్గాలు, సరస్సులకు వెళ్లే రహదారుల్లో 43,270 తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లు చేశామని, లైటింగ్, స్ట్రీట్ లైట్లు నిరంతరం పనిచేసేలా నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో చెట్ల కొమ్మలను తొలగించే పనులను పూర్తి చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బేబీ పాండ్లు, ప్రత్యామ్నాయ నిమజ్జన కేంద్రాలను సిద్ధం చేశామని, హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర నిమజ్జన ప్రాంతాల్లో హైడ్రా ఆధ్వర్యంలో ప్రత్యేక రెస్క్యూ బృందాలు, శిక్షణ పొందిన ఈతగాళ్లు, బోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
నిమజ్జన మార్గాల్లో అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మెట్రో, ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు, సేవలు అందిస్తున్నాయని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రక్రియ వేగంగా, సురక్షితంగా పూర్తయ్యేలా క్రేన్లు, సిబ్బంది, అధికారులను కీలక ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు.
DMHOల సమన్వయంతో అంబులెన్సులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని, GHMC, పోలీస్, వైద్య, విద్యుత్, ట్రాఫిక్, HYDRAA తదితర శాఖలతో కన్వర్జెన్స్, జాయింట్ సమావేశాలు నిర్వహించి సమన్వయంతో చర్యలు చేపట్టామని వివరించారు. అత్యవసర సమాచారం, ఫిర్యాదుల కోసం DIAL 112 లేదా 040-2111 1111 ద్వారా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు, ప్రజలు పోలీసులు, GHMC, ఇతర శాఖల అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, గణేష్ నిమజ్జనం హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, సంయమనంతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రజల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ పనిచేస్తోందని తెలిపారు. అందరి సహకారంతో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా, సురక్షితంగా, విజయవంతంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.