అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఇంస్టాగ్రామ్ లో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాడని, అమ్మాయి తరపు బంధువులు బీహార్ యువకున్ని అర్థ రాత్రి అడవి సమీపానికి తీసుకెళ్లి ప్లంబర్ పైపులతో విచక్షణారహితంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం వెలుగు చూసిన తీవ్ర కలకలం రేపే ఘటనకు సంబంధించి బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు.. మదనపల్లి మండలం, సీటీఎం లోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్న బీహార్ యువకుడు ముకేశ్ (20) మదనపల్లెలోని శ్రీనివాస సిమెంట్ అంగడిలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వెళ్లిన ముకేశ్ ను అమ్మాయి తరపు బంధువులు ఐదుగురు వచ్చి, మాట్లాడే పని ఉందని ఊరికి సమీపంలో ఉన్న అడవిలోనికి తీసుకెళ్లారు. తెల్లవారుజాము 1గంట వరకు సుమారు నాలుగున్నర గంటల పాటు ఏకధాటిగా చితకబాదారు. అనంతరం తీసుకొచ్చి రూములో పడేసి వెళ్లారు. అదే రూములోనే మరి కొంతమంది బిహారి యువకులు ఉండడంతో వారు సహచరులకు సమాచారం అందించి బాధితున్ని చికిత్స కోసం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో కోలు కుంటూ ఉన్నాడు.. ఘటనపై తాలూకా సిఐ కళా వెంకటరమణ కేసు విచారణ చేస్తున్నారు.