తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళా నాయకులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు వెళ్తుంటే వారిని పోలీసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
ముఖ్యంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించదగిన విషయమని అన్నారు.
అసెంబ్లీ సాక్షిగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి ప్రవర్తన జరగడం తెలంగాణ సమాజం సిగ్గుపడే విషయం. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే మరోవైపు మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులతో ఇలా వ్యవహరించడం ఏ విధమైన మహిళా గౌరవం? అని సతీష్ కుమార్ ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి దారుణం: మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు ప్రతి మహిళా సమాజం స్పందించాలి:
మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటన కేవలం బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన విషయం కాదని, ప్రజాస్వామ్యాన్ని, మహిళా గౌరవాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అంశమని సతీష్ కుమార్ అన్నారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ, గౌరవం లేకపోతే రాష్ట్రంలోని సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏ విధంగా భరోసా కల్పిస్తుందని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే వారిని అడ్డుకోవడం ద్వారా మహిళల గొంతుకను కూడా అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు ప్రజల్లోకి బీఆర్‌ఎస్ పోరుబాట:
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టామని సతీష్ కుమార్ తెలిపారు.
నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు.
హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన భారీ ధర్నా అనంతరం చేపట్టిన నిరసన ర్యాలీలో మహిళలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.