రానున్న ఏడాది మార్చి నాటికి గోదావరి పుష్కరాలకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్య అధికారులను ఆదేశించారు.
సోమవారం గోదావరి పుష్కరాల పనుల పురోగతిపై గోదావరి పరివాహక ప్రాంతాల జిల్లా కాలెక్టర్లుతో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పుష్కర ఘాట్లు, ఆలయాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇరిగేషన్, ఎండోమెంట్ శాఖలకు సంబంధించిన టైర్–2, టైర్–3 అనుమతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్ల విస్తరణ, భూసేకరణ, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయడంతో పాటు అక్టోబర్ నుంచే తాత్కాలిక ఏర్పాట్లకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ ధర్మపురిలో ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 కోట్లు, కోటిలింగాల–ఇరిగేషన్ ఘాట్ తదితర అభివృద్ధి పనులకు రూ.90 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. నిజామాబాద్, చెన్నూరు ప్రాంతాల్లోని ఇరిగేషన్, ఎండోమెంట్ పనులను సంబంధిత కలెక్టర్లు సమన్వయంతో వేగవంతం చేయాలని సూచించారు. ఫౌండేషన్ స్టోన్ వేసే సమయానికే కాంట్రాక్టర్లకు అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పనుల్లో జాప్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. భద్రాచలం పరిధిలో ఎండోమెంట్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రత్యేక అధికారిగా కృష్ణవర్ధన్‌రెడ్డిని నియమించినట్లు వెల్లడించారు.

పుష్కర పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఆండ్రాయిడ్ ఆధారిత డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసి, ప్రతి శనివారం పురోగతిపై నివేదిక తీసుకునేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కమిషనర్ హనుమంతరావు తెలిపారు.

ఐడీఓసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, పుష్కర పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. సరస్వతి ఘాట్ నుంచి మెయిన్ ఘాట్ వరకు తొలుత 9 ఎకరాలు అవసరమని అంచనా వేయగా, క్షేత్రస్థాయి సర్వే అనంతరం 18 ఎకరాల భూమి అవసరమని నిర్ధారణ అయినట్లు వివరించారు. డ్రోన్ సర్వేలో 38 ఎకరాలుగా అంచనా వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయి సర్వేలో వాస్తవ అవసరం 18 ఎకరాలుగా తేలిందన్నారు. దీనికి సుమారు రూ.5 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని, బడ్జెట్ పరిధిలోనే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వే నంబర్లను స్పష్టంగా గుర్తించి, త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
టూరిజం, విద్యుత్ శాఖల పనులు పూర్తయ్యాయని, ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలను త్వరగా పరిష్కరించడంతో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన రేట్లు పెండింగ్ అంశాలను వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మ, ఇరిగేషన్, దేవాదాయ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.