అసెంబ్లీ సాక్షిగా ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పి వెంటనే మధుపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కోరారు. సోమవారం ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక స్పీకర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని, ఆనాడు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు అదే దళిత జాతికి చెందిన బిడ్డ స్పీకర్ అవడం పట్ల జీర్ణించుకోలేకపోతున్నారనీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఇదొక చీకటి దినమని, ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వారు సభ వెలుపల ఇలా దుర్భాషలాడడం, పదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేసి,ప్రజల సమస్యలు పరిష్కరించకుండా, ప్రతిపక్షంలో కూడా అదే రీతిన వ్యవహరించడం బిఆర్ఎస్ పార్టీకే చెందిందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై ఉపేక్షించేదిలేదని మధుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పై చర్యలు తీసుకోవాలి: వొడితల ప్రణవ్