యువతే దేశానికి భవిష్యత్తు’ అనే నానుడి నేడు తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోంది. నేటి బాలలే రేపటి పౌరులు కదా అలాంటి విలువైన బాల్యం తప్పుడు మార్గాల్లో పయనిస్తూ తమ భవిష్యత్తును స్వహస్తాలతో నాశనం చేసుకుంటున్నారు. ‘ఆందోళన కలిగిస్తున్న ఈ పరిణామాలు రేపటి తరాలకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది’ అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంచలనం రేపిన గురువు హత్య: విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు
ఈ నెల 11న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణలో పోలీసులు వెల్లడించిన నిజాలు వింటే యువత ఎంతగా దారీతప్పిందో అర్థమవుతుంది. జల్సాల కోసం, డబ్బు కోసం పాఠాలు చెప్పిన గురువునే ఇద్దరు పదో తరగతి విద్యార్థులు కత్తితో పొడిచి హత్య చేయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పోలీసుల కథనం ప్రకారం..
హత్యకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారు. జల్సాలకు డబ్బులు అవసరం కావడంతో ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని పథకం వేశారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల సమయంలో పాఠశాల ముగించుకుని రూపారెడ్డి ఇంటికి బయలుదేరారు. ఆమె ఇంటికి చేరుకునేలోపే విద్యార్థులు గోడ దూకి లోపలికి ప్రవేశించారు. పాఠశాల పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన రూపారెడ్డి తమ పనులు చేసుకుంటుండగా, పథకం ప్రకారం వెనుక నుంచి దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం రూ.2 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుని హైదరాబాద్‌కు చేరుకుని ఆ నగదుతో జల్సాలు చేశారు. గతంలో చెడు స్నేహాలు, సినిమాల ప్రభావం పరిమితంగా ఉండేది. కానీ నేడు సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, రీల్స్ పిచ్చి, డ్రగ్స్, బెట్టింగ్ యాప్‌లు కొత్తగా ఈ జాబితాలోకి చేరి యువతను నేరాల వైపు నడిపిస్తున్నాయి.
అసలు బాల్యం ఎందుకు దారి తప్పుతోంది? తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం!
ఇది అతి పెద్ద కారణం. గతంలో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలిసేది. ఇప్పుడు ఉద్యోగాల్లో బిజీగా ఉంటూ, పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చి తమ బాధ్యత తీరిపోయిందనుకుంటున్నారు. రాత్రి 2 గంటల వరకు పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో పట్టించుకోవడం లేదు. అతి గారాబం, అడిగినవన్నీ కొనివ్వడం వల్లే వారు విచ్చలవిడిగా తయారవుతున్నారు.
సాంకేతికత దుర్వినియోగం:
చేతిలో స్మార్ట్‌ఫోన్, అపరిమిత ఇంటర్నెట్ ఉండటంతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం గంటల తరబడి సమయం వృథా చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలై వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఐపీఎల్ బెట్టింగ్, ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ఉచ్చులో పడి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు.
నైతిక విలువలు లేమీ:
మార్కులే ప్రధానం అనే ఒత్తిడి పెరిగిపోవడంతో నైతిక విలువలు, క్రమశిక్షణ, జీవన నైపుణ్యాలు నేర్పే పాఠాలు పాఠశాలల్లో కరువయ్యాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో హింస, అశ్లీలతను గొప్పగా చూపించడం యువతను తప్పుదోవ పట్టిస్తోంది.
పరిష్కార మార్గాలు- తల్లిదండ్రుల బాధ్యత:
రోజూ కనీసం ఒక గంట పిల్లలతో మాట్లాడాలి. వారి ఫోన్‌ను తనిఖీ చేయడం తప్పు కాదు, అది బాధ్యతగా గుర్తించాలి. పిల్లలకు స్నేహితుడిలా ఉండాలి.
విద్యార్థులకు గుర్తింపు:
ఫోన్ జీవితం కాదు, అది ఒక సాధనం మాత్రమే అని గ్రహించాలి. రీల్స్ లైకుల కంటే జీవితంలో సాధించే విజయం గొప్పదని గుర్తించాలి.
పాఠశాలల పాత్ర:
ప్రతి స్కూల్లో కౌన్సెలింగ్, కెరీర్ గైడెన్స్ తప్పనిసరి చేయాలి. సాంకేతికతను వద్దనలేం, కానీ దానిని ఎలా వాడాలో పిల్లలకు నేర్పడం మన చేతుల్లోనే ఉంది. తల్లిదండ్రులు కళ్లు తెరవకపోతే, రేపటి తరం చేజారిపోయే ప్రమాదం ఉందని గ్రహించాలి.