Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి
Share Short Clip Download PDF

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఓటర్ల దరఖాస్తులు, అనామలీస్, నో-మ్యాపింగ్ కేసులు, నోటీసులు, విచారణ ప్రక్రియపై సీఈఓ సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అనామలీస్, నో-మ్యాపింగ్ కేసుల పరిష్కారానికి ఏఈఆర్ఓ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు వారీగా ప్రత్యేక ఏర్పాటు చేసి, తగిన సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. ఆధార్‌ను గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణించాలని, నివాస ధ్రువీకరణ పత్రంగా పరిగణించరాదని సీఈఓ స్పష్టం చేశారు. ఓటర్లకు విచారణ తేదీ, సమయం, వేదిక వివరాలను అవసరమైన సందర్భాల్లో ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. జీవించి ఉన్న ఓటర్లను మరణించిన వారిగా నమోదు చేయడం, దరఖాస్తులు పరిష్కరించకపోవడం వంటి తప్పులపై బాధ్యులైన సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఐడిఓసి కార్యాలయం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ..

భూపాలపల్లి నియోజకవర్గంలో 20,876 అనామలీస్, గత ప్రత్యేక ఓటరు సవరణతో అనుసంధానం లేని ఓటర్లు 11,739 మంది, యు.ఈ.ఎఫ్ లు 35,918 మంది మొత్తం 68,533 ఓటర్ల వివరాల్లో అసమానతలు, గత సర్ తో అనుసంధానం లేని ఓటర్లు మరియు యు.ఈ ఎఫ్ లకు సంబంధించిన వివరాలు గుర్తించామని తెలిపారు. నిబంధనల ప్రకారం పరిశీలించి, అవసరమైన చోట విచారణ నిర్వహించి పరిష్కరిస్తామని తెలిపారు. ఏ ఈఆర్ఓలు, బూతు సూపర్‌వైజర్లకు విచారణ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ నిర్వహించి, తహశీల్దార్ స్థాయి నుంచి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సవరణ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డిఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటి కలెక్టర్ నవీన్ రెడ్డి, భూపాలపల్లి, రేగొండ మండలాల తహసీల్దార్లు లక్ష్మి రాజయ్య, శ్వేతా, పర్యవేక్షకులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.