జగిత్యాల పట్టణంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకల్లో పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేడుకల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం ట్రాన్స్ జెండర్ల సేవలను వినియోగించుకోవడం పట్ల స్థానికంగా తీవ్ర హర్షం వ్యక్తమవుతోంది.

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ ఆదేశాల మేరకు మొత్తం 17 మంది ట్రాన్స్ జెండర్లకు ఈసారి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడటం మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలతో కలిసి వారు విధులు నిర్వహించారు.

అప్పగించిన బాధ్యతలను ఎంతో క్రమశిక్షణతో, జవాబుదారీతనంతో నిర్వహించి, వేడుకలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందించారు. సమాజంలో తమ పట్ల ఉన్న భావనలను పక్కనబెట్టి తమపై నమ్మకంతో పోలీస్ శాఖ ఇచ్చిన ఈ గౌరవం, గుర్తింపు తమలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ట్రాన్స్ జెండర్లు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. తమను సమాజ ప్రధాన స్రవంతిలో భాగం చేస్తూ బాధ్యతాయుతమైన విధుల్లో భాగస్వాములను చేసిన ఎస్పీ కి, పోలీస్ యంత్రాంగానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.