జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాలోని యాష్విల్లేకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. భారత్లో పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు.
అమెరికాలో జీ-20 భేటీకి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
అమెరికాలోని నార్త్ కరోలినాలోని యాష్విల్లేలో జరగనున్న జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అక్కడకు చేరుకున్నారు. కెనడా పర్యటన ముగించుకుని అమెరికాకు చేరుకున్న నిర్మలా సీతారామన్ కు… గ్రీన్విల్లే-స్పార్టన్బర్గ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఘన స్వాగతం పలికారు. పశ్చిమాసియా, యూరప్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిని బలపరచడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.
3ఎం సీఈఓతో ప్రత్యేక భేటీ
జీ-20 సమావేశాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రముఖ బహుళజాతి సంస్థ 3ఎం ఛైర్మన్, సీఈఓ విలియం బ్రౌన్తో సమావేశమయ్యారు. భారత్లో తయారీ రంగాన్ని మరింత విస్తరించడం, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా దేశాన్ని మార్చడంపై ఈ చర్చలు జరిగాయి. భారత్లో అందుబాటులో ఉన్న ప్రతిభావంతులైన మానవ వనరుల సద్వినియోగం, డేటా భద్రత అంశాలపై వారు చర్చించారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులను మరింత పెంచాలని ఈ సందర్భంగా కోరారు.