రూ.30 లక్షలతో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం తాత్కాలిక షెడ్డు నిర్మించేందుకు టీచర్ సుమారు రూ.40 వేల సొంత డబ్బును వెచ్చించడం అభినందనీయమని అన్నారు. పిల్లల సంక్షేమం కోసం తన సొంత డబ్బును ఖర్చు చేసి తాత్కాలిక వసతి ఏర్పాటు చేసిన టీచర్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా విద్య, వైద్య రంగాలను అత్యంత ప్రాధాన్యతా రంగాలుగా భావించి పనిచేస్తోందని మంత్రి అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించామని, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక ఏటిసి ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయా కేంద్రాల ద్వారా యువతకు ఆధునిక నైపుణ్యాలతో కూడిన కోర్సుల్లో శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏటిసి లను దూరదృష్టితో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
తిరుమలాయపాలెం మండలంలో వైద్య రంగానికి కూడా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కొత్త ఆసుపత్రుల నిర్మాణంతో పాటు ఆసుపత్రుల్లో వైద్యులు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి అన్నారు. గత రెండున్నరేళ్లలో మహిళా సంఘాలకు రూ.63 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్నా మని, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నా మని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశలో ఇళ్లను మంజూరు చేశామని, ప్రస్తుతం రెండో దశ ఇళ్లను అందిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని స్పష్టం చేశారు.
కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.