రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రతి భూయజమానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కతో కలిసి సోమవారం మహబూబాబాద్ ఐడీఓసీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని రెవెన్యూ, భూ రీ-సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లో భూ రీ-సర్వే పురోగతి, నాన్-కెడస్ట్రల్ మరియు కెడస్ట్రల్ గ్రామాల్లో సర్వే పనులు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల పనితీరు, 22-ఏ భూముల వివరాలు, సాదా బైనామాలు, అటవీ–రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలు, ధరణి స్థానంలో అమలులోకి వచ్చిన భూభారతి చట్టం, రిజిస్ట్రేషన్ శాఖ నూతన కార్యాలయాల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, రెండో విడత ఇళ్ల మంజూరు, ఉచిత ఇసుక సరఫరా తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.