Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
ఇంటర్వ్యూలు

తెలుగు - తేనెలొలికే అమృతధార...

జనార్ధనాచార్యులు, తెలుగు పండిట్ (విశ్రాంత)తో ముఖాముఖి: తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేక ఇంటర్వ్యూ, మ్యాకల మహేష్, వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (రైట్స్ మీడియా).

తెలుగు - తేనెలొలికే అమృతధార...
Share Short Clip Download PDF

ఇది భాష కాదు, మన శ్వాస:

ఒక ఇటాలియన్ పర్యాటకుడు తెలుగు మాటలు విని ఆశ్చర్యంగా అన్నాడట - "మీరు మాట్లాడుతుంటే చెవిలో తేనె పోస్తున్నట్టు ఉంది" అని. అందుకే ప్రపంచం మన భాషకు "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని పేరు పెట్టింది.

ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి పదం అచ్చుతో ముగుస్తుంది. అమ్మ, నాన్న, అన్నం, నీళ్లు, ప్రేమ... ఎంత తియ్యగా ఉంటాయో చూడండి. ఈ మాధుర్యం ప్రపంచంలో ఏ భాషకూ లేదు.

ప్రశ్న 1: ఇంగ్లీష్ హవాలో తెలుగు కనుమరుగవుతోందా?

ఇది సంక్షోభం కాదు, మనం సృష్టించుకున్న అభద్రతా భావం. ఇంగ్లీష్ ఉద్యోగం ఇస్తుంది, తెలుగు జీవితాన్ని ఇస్తుంది. ఉద్యోగం కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కానీ జీవించడం కోసం తెలుగును బతికించుకోవాలి. తల్లి పాలు తాగుతూనే, బయట నీళ్లు తాగినట్టు, రెండూ అవసరమే. కానీ తల్లిని మరిచిపోకూడదు.

ప్రశ్న 2: నేటి తెలుగు వ్యావహారికమా, వికృతమా?

గిడుగు వారు గ్రాంథికాన్ని వదిలి, ప్రజల భాషను తెచ్చారు. కానీ నేడు మనం ప్రజల భాషను వదిలి, "మింగ్లీష్" లోకి వెళ్తున్నాం. "నా లైఫ్ లో ఫుల్ టెన్షన్ రా" అనడం వ్యావహారికం కాదు, అది భాషా సోమరితనం. ఆలోచించే ఓపిక లేక ఇంగ్లీష్ పదాన్ని అతికించేస్తున్నాం. ఇది వికృతమే.

ప్రశ్న 3: యువత తెలుగు ఎందుకు నేర్చుకోవాలి?

ఒక భాష నేర్చుకోవడం అంటే ఒక కొత్త ప్రపంచాన్ని చూడటం. ఇంగ్లీష్ లో "అమ్మ" అనే పదానికి ఫీలింగ్ ఉండదు. "అమ్మ" అని పిలిస్తే వచ్చే కంపనం, "Mother" అంటే రాదు. మన వేర్లను తెలుసుకోవడానికి, మన ఆత్మగౌరవం కోసం తెలుగు నేర్చుకోవాలి. తెలుగు తెలియని తెలుగువాడు, చిరునామా లేని ఉత్తరం లాంటివాడు.

ప్రశ్న 4: తెలుగును బతికించడానికి చేయాల్సిన 3 పనులు?

1) ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగును కచ్చితంగా ఒక మాధ్యమంగా పెట్టాలి, కేవలం సబ్జెక్టుగా కాదు.
2) ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగులో రాసిన వారికి 5% వెయిటేజీ ఇవ్వాలి.
3) ప్రతి తల్లిదండ్రి పిల్లలతో రోజూ అరగంట సేపు కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. ఇంట్లో మొదలైతేనే భాష బతుకుతుంది.

ప్రశ్న 5: సోషల్ మీడియాలో తెలుగు పునర్జీవమా?

100% పునర్జీవమే. ఒకప్పుడు తెలుగు రావాలంటే పుస్తకం కొనాలి. ఇప్పుడు ఒక రీల్ తో లక్షల మందికి చేరుతోంది. కాకపోతే అక్కడ భాష కాస్త బూతు, కాస్త హాస్యానికి పరిమితమవుతోంది. దాన్ని సాహిత్యం వైపు మళ్లించాలి.

ప్రశ్న 6: యువత చదవాల్సిన ఒక పుస్తకం?

నాకు ఇష్టమైనది గురజాడ "కన్యాశుల్కం". యువత చదవాల్సింది శ్రీశ్రీ "మహాప్రస్థానం". అది చదివితే "పద్యం పాడుతూ పదవేయరా" అనే ఫైర్ వస్తుంది. ఒకసారి మహాప్రస్థానం చదివినవాడు, జీవితంలో ఎప్పుడూ నిరాశ పడడు.

ప్రశ్న 7: "తెలుగు రాదు" అని గర్వపడే తల్లిదండ్రులకు ఏం చెబుతారు?

వారిని చూసి జాలిపడతాను. ఇది గర్వం కాదు, ఆత్మవంచన. మీ పిల్లలకు మీ అమ్మ భాషను నేర్పలేని మీరు, వారికి ఏ సంస్కృతిని ఇస్తారు? రేపు వాడు అమెరికాలో స్థిరపడి, మిమ్మల్ని కూడా "Who are you?" అంటే అప్పుడు తెలుస్తుంది బాధ ఏమిటో. ఇది భాషా ద్రోహమే.

ప్రశ్న 8: AI లో తెలుగుకు చోటు ఉందా?

ఉంది, కానీ మనమే ఇవ్వాలి. ChatGPT కి మనం తెలుగులో ఎంత ఎక్కువ టైప్ చేస్తే, అది అంత బాగా నేర్చుకుంటుంది. మనం తెలుగులో రాయడం మానేస్తే, రేపటి AI కూడా తెలుగును మర్చిపోతుంది. టెక్నాలజీలో తెలుగును బతికించే బాధ్యత టెక్ కంపెనీలది కాదు, మనదే.

ప్రశ్న 9: యాసల గొడవ గురించి?

యాసలే తెలుగుకు అందం. తెలంగాణ తెలుగులో ధైర్యం ఉంది, కోస్తా తెలుగులో మాధుర్యం ఉంది, రాయలసీమ తెలుగులో తెగువ ఉంది. ఇవి మూడు కలిస్తేనే తెలుగు పరిపూర్ణం. యాసను ఎగతాళి చేయడం అంటే, తల్లి చీరలోని రంగులను ఎగతాళి చేయడమే.

ప్రశ్న 10: విద్యార్థులకు, యువతకు మీరిచ్చే సందేశం?

ఒక్కటే చెబుతా - "తెలుగులో ఆలోచించండి, ప్రపంచంతో పోటీపడండి." ఇంగ్లీష్ నేర్చుకోండి, కానీ తెలుగులో కలలు కనండి. మీ సంతకాన్ని తెలుగులో పెట్టడం మొదలుపెట్టండి. అదే ఈ భాషా దినోత్సవానికి మీరు ఇచ్చే నిజమైన గౌరవం.

ఈ మాధుర్యాన్ని తెలుగు మహాకవులు ఎలా చూశారో చూడండి:

1. రాయలవారి గర్వం:
16 భాషలు తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు సైతం తన తల్లి భాష ముందు తలవంచి ఇలా అన్నాడు.
దేశ భాషలందు తెలుగు లెస్స

2. సినారె వారి ముద్దు:
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి దీన్ని ఒక్క ముక్కలో చెప్పారు
"తెలుగు పలుకు తేనేలొలుకు" అని చెప్పారు.

3. గురజాడ వారి తేటదనం:
మన మనసు ఎలాంటిదో గురజాడ అప్పారావు చెప్పారు.
"మాటలాడితే తేటతెల్లమౌ-మనసు చూస్తే మల్లెపూవు"
ఇది తెలుగువాడి లక్షణం, తెలుగు భాష లక్షణం కూడా.

మరి తెలుగు ఇంత గొప్పది ఎందుకు?

సైన్స్ భాష: మన వర్ణమాల ఒక సైన్స్ లాబ్. క, చ, ట, త, ప... ఇవి గొంతు నుంచి పెదవుల వరకు పలికే క్రమం. మన పూర్వీకులు శబ్దాన్ని శాస్త్రం చేశారు.

మోసం లేని భాష: ఇంగ్లీష్ లో 'BUT' అని రాసి 'బట్' అని చదవాలి. కానీ తెలుగులో రాసినట్టే చదువుతాం, చదివినట్టే రాస్తాం. ఇది నిజాయితీ గల భాష.

విశాలమైన భాష: ఇంగ్లీష్ లో LOVE అంటే ఒక్కటే. కానీ మనకు ప్రేమ, అనురాగం, ఆప్యాయత, వాత్సల్యం, ప్రణయం... ఒక భావానికి వెయ్యి పదాలు ఉన్న ఐశ్వర్యం మనది.

విప్లవ భాష: గిడుగు రామ్మూర్తి గారు "పండితుల భాష కాదు, పామరుల భాష కావాలి" అని పోరాడి, మన భాషను మనకు దగ్గర చేశారు.

మరి నేడు మనం ఏం చేస్తున్నాం?
"మమ్మీ, నాకు వాటర్ కావాలి" అంటున్నాం. తేనె లాంటి భాషను వదిలి, కల్తీ భాష మాట్లాడుతున్నాం.

తెలుగు మన భాష కాదు... మన శ్వాస!

గుర్తుపెట్టుకోండి..మహాకవి శ్రీశ్రీ అన్నట్టు...

"తెలుగుదనమంటే విశ్వమానవసౌభ్రాతృత్వం"
తెలుగు నేర్చుకుంటే మనం ప్రపంచంతో మాట్లాడగలం అనుకుంటాం. కానీ నిజం ఏంటే - తెలుగును ప్రేమిస్తే, ఈ ప్రపంచమే మనతో మాట్లాడుతుంది.
ఎందుకంటే, తెలుగు మన భాష కాదు... మన శ్వాస!