Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల సంఘం సీరియస్

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల సంఘం సీరియస్
Share Short Clip Download PDF

తెలంగాణ మానవ హక్కుల సంఘం రిమ్స్ ఘటనపై సుమోటోగా కేసు స్వీకరించింది. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై కమిషన్ వివరణ కోరింది. ఈ ఘటనపై అక్టోబర్ 27న విచారణ చేపట్టనున్నట్లు కమిషన్ తెలిపింది.

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటనలో నవజాత శిశువులు మృతి చెందారు. ఈ దుర్ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ సందర్భంగా ఘటనపై పూర్తి స్థాయి సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు. 27 మంది శిశువులు ఉన్న వార్డులో AC షార్ట్ సర్క్యూట్ వల్ల దట్టమైన పొగ అలముకుని 5 గురు ప్రాణాలు కోల్పోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రిమ్స్ ఆసుపత్రిలోని SNCU విభాగంలో భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ వ్యవస్థ నిర్వహణ, ఫైర్ అలారాలు, అగ్నిమాపక పరికరాల స్థితిగతులపై వివరణ ఇవ్వాలని వైద్య శాఖ ముఖ్యకార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, రక్షణ చర్యలు, బాధ్యులపై చేపట్టిన విచారణ వివరాలను నివేదికలో పొందుపరచాలని పేర్కొంది. అక్టోబర్ 27న ఈ ఘటనపై విచారణను చేపట్టనున్నట్లు కమిషన్ తెలిపింది.