నిజామాబాద్(రైట్స్ మీడియా): దివ్యాంగ పిల్లలను అక్కున చేర్చుకుని వారికి మనోధైర్యం కల్పిస్తూ, భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తున్న స్నేహ సొసైటీ సేవలు ఎంతో అభినందనీయమని నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, నుడా (NUDA) చైర్మన్ కేశవేణు కొనియాడారు.
మానసిక దివ్యాంగ విద్యార్థుల ఉన్నతికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్‌లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల ఆవరణలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నగర మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశవేణులు పండిత్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్నేహ సొసైటీ ఏర్పాటు, ఇప్పటివరకు దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరియు వారి ఆరోగ్య పరిస్థితుల వివరాలను సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతిలు ముఖ్య అతిథులకు, పలు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు క్లుప్తంగా వివరించారు.