హనుమకొండ, అక్టోబర్ 22(రైట్స్ మీడియా): వరంగల్ నగర భవిష్యత్తు అభివృద్ధి, ప్రజల సౌకర్యాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండ బస్టాండ్ నుంచి జేఎన్ఎస్ స్టేడియం మీదుగా డీసీసీ భవన్ వరకు సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
వరంగల్ నగర భవిష్యత్తు అభివృద్ధి కోసమే రోడ్ల విస్తరణ..
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నగర అభివృద్ధిని అడ్డుకోవద్దు..
ప్రజల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలకు సహకరించాలి: ఎమ్మెల్యే నాయిని..
రూ.2 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతో రోడ్లపై ట్రాఫిక్ తీవ్రంగా పెరుగుతోందని, అనేక ప్రాంతాల్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పాతకాలం నాటి రహదారులు ప్రస్తుత జనాభా, వాహనాల అవసరాలకు సరిపోవడం లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నగర అభివృద్ధిని పక్కన పెట్టడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. నేటి నిర్ణయాలు రేపటి తరాలకు ఉపయోగపడేలా ఉండాలని, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను రాజకీయ కోణంలో చూడకుండా, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోవాలని సూచించారు.
హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ఇరుకుగా ఉండటంతో ప్రయాణికులు, వాహనదారులు, స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్టాండ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న రహదారులను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే బస్టాండ్ నుంచి జేఎన్ఎస్ స్టేడియం మీదుగా డీసీసీ భవన్ వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
గతంలో రోడ్లపైకి భవనాలు, దుకాణాలు విస్తరించేలా అనుమతులు ఎలా ఇచ్చారో ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రహదారుల విస్తరణకు ఆటంకాలు కలిగించే నిర్మాణాల వల్ల నగర అభివృద్ధికి నష్టం జరుగుతోందని అన్నారు. గతంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఏర్పడిన సమస్యలను ఇప్పుడు సరిచేయడానికి సమయం, శ్రమ అవసరమవుతున్నాయని తెలిపారు.
గతంలో ఈ రహదారిపై అనేక గుంతలు ఉండేవని, వాటి కారణంగా వాహనదారులు, ప్రజలు ప్రమాదాలకు గురై ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం రోడ్లను మెరుగుపరచి, విస్తరించి, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులకు సహకరించాల్సిన ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. నగర అభివృద్ధిని అడ్డుకునే విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, విమర్శలు చేయడం కంటే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులకు సూచించారు. నగర ప్రయోజనాల కోసం ఎవరైనా మంచి సలహాలు ఇస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జేఎన్ఎస్ స్టేడియం పరిసర ప్రాంతాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. స్టేడియం పరిసరాల్లో రహదారి విస్తరణతో పాటు వాణిజ్యపరమైన అవకాశాలను మెరుగుపరిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. ఆ ఆదాయాన్ని నగర అభివృద్ధికి, స్టేడియం వంటి ప్రజా అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
స్టేడియం వైపు ఉన్న హాస్టళ్లలో నివసించే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రహదారుల విస్తరణ, వాణిజ్య అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలను సమన్వయం చేసుకుంటూ నగరాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
వరంగల్, హనుమకొండ నగరాలు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలంటే ఇప్పటి నుంచే సరైన నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా సహకరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులపై రాజకీయాలకు అతీతంగా సహకరిస్తేనే నగరానికి మెరుగైన రహదారులు, సులభమైన రవాణా, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.