విజయవాడ, అక్టోబరు 15(రైట్స్ మీడియా): గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు స్వయం ఏపీ బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో లక్ష మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, మరో ఐదు లక్షల మందిని ఆ దిశగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విజయవాడలో తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా-2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దసరా శరన్నవరాత్రుల వేళ జాతీయ సరస్ మేళా నిర్వహించడం విజయవాడకు మరింత శోభ తెచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మించి ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె.. ఎన్నో సవాళ్లను అధిగమించి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించారని కొనియాడారు. సంకల్ప బలం, ధైర్యం ఉంటే మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆమె నిరూపించారని తెలిపారు. జాతీయ సరస్ మేళాలో 650 స్వయం సహాయక సంఘాలు పాల్గొంటున్నాయని సీఎం తెలిపారు. ఇది కేవలం 14 రోజులపాటు జరిగే ప్రదర్శన కాదని, గ్రామీణ మహిళల ఉత్పత్తులకు ఏడాది పొడవునా మార్కెట్ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహిళల ఆదాయాన్ని పెంచడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం మేళా ప్రధాన ఉద్దేశమని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల మహిళలు తమ అనుభవాలను పంచుకోవడంతోపాటు విజయగాథలను తెలుసుకోవాలని, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించాలని సూచించారు.