Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
లీగల్ డెస్క్

ప్రశ్నించడమే కాదు.. నిలదీసి సాధిస్తాం: 'రైట్స్ మీడియా' సరికొత్త బ్రహ్మాస్త్రం 'లీగల్ డెస్క్'

- పౌరుల్లో చట్టపరమైన అవగాహన పెంచే దిశగా 'రైట్స్ మీడియా సొసైటీ' చారిత్రాత్మక అడుగు.

ప్రశ్నించడమే కాదు.. నిలదీసి సాధిస్తాం: 'రైట్స్ మీడియా' సరికొత్త బ్రహ్మాస్త్రం 'లీగల్ డెస్క్'
Share Short Clip Download PDF

- ఆర్టీఐ దరఖాస్తులు, అధికారిక ఫిర్యాదులు, యాక్షన్ టేకెన్ రిపోర్టులకు డిజిటల్ వేదిక.

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో పాటు.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడటమే నిజమైన జవాబుదారీతనం. ఈ సామాజిక బాధ్యతను మరింత బలోపేతం చేస్తూ, పారదర్శకత కోసం 'రైట్స్ మీడియా సొసైటీ' తన అధికారిక వెబ్‌సైట్‌లో సరికొత్త అస్త్రంగా 'లీగల్ డెస్క్' (Legal Desk) విభాగాన్ని ప్రారంభిస్తోంది.

లక్ష్యం ఒక్కటే.. చట్టబద్ధమైన జవాబుదారీతనం!

ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత లోపించడం, చట్టాల పట్ల అధికారుల నిర్లక్ష్యం మనం నిత్యం చూస్తున్నాం (ఇటీవల వర్థన్నపేట జూనియర్ కళాశాల ఆర్టీఐ బోర్డు ఉదంతమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ). వ్యవస్థలోని ఈ లొసుగులను కేవలం అక్షరాలతో ఎండగడితే సరిపోదు, అవసరమైనప్పుడు న్యాయపరమైన కొరడా ఝుళిపించాలి. అందుకే, పౌరుల పక్షాన రైట్స్ మీడియా చేసే ప్రతి న్యాయ పోరాటానికి ఈ 'లీగల్ డెస్క్' ఒక సజీవ డిజిటల్ సాక్ష్యంగా నిలవబోతోంది.

'లీగల్ డెస్క్' లో ఏముంటాయి?

ఈ ప్రత్యేక విభాగం ద్వారా ప్రజలకు పారదర్శకమైన మరియు వాస్తవ ఆధారిత సమాచారం నేరుగా అందుతుంది:

• సమాచార హక్కు (RTI Act 2005) ఆయుధం: ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగంపై ప్రజల తరఫున రైట్స్ మీడియా వేసే ఆర్టీఐ దరఖాస్తుల కాపీలు, దానికి అధికారులు ఇచ్చే అధికారిక సమాధానాలు, నిర్లక్ష్యం వహించే అధికారులపై ఉన్నతాధికారులకు చేసే అప్పీళ్ల వివరాలు ఇందులో పబ్లిష్ అవుతాయి.

• న్యాయ పోరాటం - అధికారిక ఫిర్యాదులు: వ్యవస్థాగత లోపాలు, అవినీతి, బాధ్యతారాహిత్యాలపై నేరుగా పోలీస్ స్టేషన్లలో, లేదా సైబర్ క్రైమ్, విజిలెన్స్ అధికారులకు, సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు రైట్స్ మీడియా చేసే అధికారిక న్యాయపరమైన ఫిర్యాదుల కాపీలను ఇక్కడ ప్రజల ముందుంచుతాం.

• యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ (Action Taken Reports - ATR): ఒక వార్త రాసిన తర్వాత లేదా ఫిర్యాదు చేసిన తర్వాత సంబంధిత అధికారుల నుండి వచ్చిన స్పందన ఏమిటి? బాధ్యులపై తీసుకున్న చర్యలు ఏమిటి? తదితర పూర్తి ఫాలో-అప్ వివరాలు ఈ డెస్క్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

• పౌర హక్కుల అవేర్‌నెస్: సామాన్యులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, వినియోగదారుల హక్కులు, ఎఫ్.ఐ.ఆర్ నమోదు ప్రక్రియ లాంటి చట్టపరమైన అంశాలపై నిపుణుల విశ్లేషణలు ఉంటాయి.

న్యాయ నిపుణుల అండతో.. రాజీలేని పోరాటం

ఇకపై అధికారుల తప్పులు, అక్రమాలు కేవలం ఒక వార్తా కథనంతో ఆగిపోవు. రైట్స్ మీడియా 'లీగల్ డెస్క్' ఆ తప్పును నేరుగా ఉన్నతాధికారులు, చట్టం ముందు నిలబెడుతుంది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి పారదర్శకతను పాతిపెట్టే వారెవరికైనా ఈ డెస్క్ ఒక సింహస్వప్నం లాంటిది.

చట్టపరమైన అవగాహన ద్వారా సామాన్యులను చైతన్యపరచి, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్న రైట్స్ మీడియా సొసైటీ లక్ష్య సాధనలో ఈ 'లీగల్ డెస్క్' ఒక మైలురాయి. 'సత్యానికి శక్తినివ్వడం - హక్కులను పరిరక్షించడం' (Powering Truth - Defending Rights) అనే మా సంస్థ మూల ఆశయానికి అనుగుణంగా ఈ డెస్క్ పనిచేస్తుంది. ప్రముఖ న్యాయవాదుల సహకారంతో, అనుభవజ్ఞులైన న్యాయ నిపుణుల విలువైన సలహాలు, మార్గదర్శకత్వంతో.. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం రైట్స్ మీడియా సొసైటీ అత్యంత బాధ్యతాయుతంగా, నిరంతరం పోరాడుతుంది.

(గమనిక: లీగల్ డెస్క్ లో పొందుపరిచే సమాచారం ప్రజల అవగాహన కోసం మాత్రమే ఉద్దేశించబడింది.)