హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల, హాస్టల్‌లోని వసతులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులను వేర్వేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తెలిపిన సమస్యలను మంత్రి స్వయంగా నోట్ చేసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

హాస్టల్‌లో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులతో కలిసి ప్రతిరోజూ సిబ్బందిలో ఒకరు భోజనం చేయాలని, ఆహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.విద్యార్థులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి భోజనం, వసతులపై వారి అభిప్రాయాలను తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై భోజనానికి సంబంధించి విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాను హుస్నాబాద్ వచ్చినప్పుడు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తాననీ విద్యార్థుల సమస్యలను నేరుగా తెలుసుకుంటాననీ, విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పే హక్కు ఉంది. నేను మీ గార్డియన్‌గా ఉంటాను అని మంత్రి విద్యార్థులతో అన్నారు.
బాయ్స్ హాస్టల్‌లో బాత్రూమ్ తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన వసతులు, మంచి ఆహారం, రవాణా సదుపాయాలు కల్పించడం తన బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్, అధ్యాపకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.