Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
Share Short Clip Download PDF

స్థానిక రామకృష్ణ ఫంక్షన్ హాల్లో మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన యువత ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆశయంతో పీఎస్ఆర్ ట్రస్ట్, రైట్ చాయిస్ అకాడమీ ల ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణా కార్యక్రమాన్ని గురువారం రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల కుటుంబాల్లో కనిపించే ఆనందం, వారు చూపే కృతజ్ఞత వర్ణించలేనిదని పేర్కొన్నారు. గతంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులతో కలిసి భోజనం చేసిన క్షణాలు తన జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు సాధించిన తర్వాత, మీ వద్దకు సహాయం కోసం వచ్చే పేదలను, బాధితులను మనుషుల్లా గౌరవించి, ప్రేమ ఆప్యాయతలతో న్యాయం చేయాలన్నారు.

కష్టపడకుండా ఏదీ రాదని, ఒకవేళ అయాచితంగా లభించినా అది శాశ్వతంగా నిలవదని మంత్రి అన్నారు. మన సొంత కష్టంతో సాధించిన విజయమే మనకు నిజమైన తృప్తిని, శాశ్వత స్థానాన్ని ఇస్తుందని తెలిపారు. అధికారాలు, పదవులు శాశ్వతం కావని, జీవితంలో పదవులు, డబ్బు ఎప్పుడూ ఒకేలా ఉండవని, జీవితం ఒడుదుడుకులతో కూడుకున్నదన్నారు. ఉచిత శిక్షణకు సుమారు 2,200 నుండి 2,300 మంది నమోదు చేసుకున్నారని, అందులో 1,500 మంది రోజూ క్రమం తప్పకుండా వచ్చే వారుంటారని, అభ్యర్థులందరికీ మంచి ఫ్యాకల్టీతో పాఠాలు, నాణ్యమైన స్టడీ మెటీరియల్ అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.
రాబోయే 60 రోజుల కాలాన్ని అభ్యర్థులు క్రమశిక్షణతో ఉపయోగించుకుని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని ఆకాంక్షిస్తూ, అందరికీ ఆల్ ది బెస్ట్" అని మంత్రి ఆశీర్వదించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ..

విద్యార్థులు తమ జీవితంలో అనుకున్న లక్ష్యాలను, పోటీ పరీక్షల్లో విజయం సాధించడంలో సబ్జెక్ట్ పరిజ్ఞానంతో పాటు సరైన మానసిక దృక్పథం అత్యంత కీలకమైనదని అన్నారు. విద్యార్థుల విజయంలో 90% పాత్ర వారి మైండ్‌సెట్‌పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. సబ్జెక్టు నేర్పించడానికి నిపుణులు, పుస్తకాలు, టెస్ట్ సిరీస్‌లు అందుబాటులో ఉంటాయని, కానీ మనసులో గెలుపుపై నమ్మకం పెంచుకోవడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. మనం అనుకున్న కల ను సాధించి గమ్యాన్ని చేరుకోవడానికి రెండు కీలక గుణాలు అవసరం.
ఆత్మవిశ్వాసం, పట్టుదల అవసరమని అన్నారు. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియంలో చదివాను, పేదరికంలో పుట్టాను వంటి ఆలోచనలను పక్కన పెట్టాలన్నారు. పుట్టుకతో ఎవరికీ ఏ విద్య రాదని, సమయం కేటాయించి నేర్చుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం మనపై మనకు ఉండాలని కలెక్టర్ తెలిపారు. చదువుకునే క్రమంలో నిద్రపోవడం, ఆర్థిక సమస్యలు, పరిసరాల ప్రభావాలు వంటి అనేక అడ్డంకులు వస్తాయన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం పూర్తయ్యే వరకు ఆగకుండా ముందుకు సాగడమే నిజమైన పట్టుదల అని, ఈ రెండింటినీ అలవర్చుకొని ఉపాధ్యాయులు చెప్పే సలహాలను పాటిస్తూ,
రాబోయే పరీక్షల్లో విద్యార్థులందరూ అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు డీసీపీ రామానుజం, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఎదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పొకబతిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.