Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఓటు హక్కు పరిరక్షణ కోసం భారీ నిరసన ర్యాలీ

⏩SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆందోళన

ఓటు హక్కు పరిరక్షణ కోసం భారీ నిరసన ర్యాలీ
Share Short Clip Download PDF

⏩కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం

గోదావరిఖని (రైట్స్ మీడియా): ఓటు హక్కు పరిరక్షణ కోసం, SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 54వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా ఆధ్వర్యంలో ఇండియా కూటమి లోని భాగస్వాములైన పార్టీలతో కలిసి బుధవారం గోదావరిఖని మెయిన్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇండియా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.

ర్యాలీ అనంతరం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..

ఓట్ల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల సంఘం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. SIR ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న మార్పులు, తొలగింపులపై సమగ్రంగా విచారణ చేపట్టాలని కోరారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని స్పష్టం చేశారు. ఓటు హక్కు కేవలం ఎన్నికల్లో పాల్గొనే హక్కు మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు.

ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, జవాబుదారీతనం ఉండాలని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం, అన్యాయం లేదా అర్హులైన ఓటర్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిందేనని నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..

అలాగే SIR ప్రక్రియపై తలెత్తుతున్న అనుమానాలు, అభ్యంతరాలు మరియు ఓటర్ల హక్కుల పరిరక్షణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలైన సిపిఐ, సిపిఐ (ఎం ఎల్)న్యూ డెమోక్రసీ, INTUC, మరియు గంగ పుత్ర, ముదిరాజ్, యాదవ్, విశ్వ బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, మాల, మాదిగ, మైనారిటీ, గౌడ, మరియు మిగతా కుల సంఘాల నాయకులు
యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇండియా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.