Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

కేబినెట్ లోకి మహేష్ గౌడ్?...

కేబినెట్ లోకి మహేష్ గౌడ్?...
Share Short Clip Download PDF

మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 3న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ప్రధానంగా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగించడం, మంత్రివర్గంలో విస్తృత మార్పులు చేయడం కోసం కావచ్చని కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే క్రమశిక్షణా కమిటీ నివేదిక.. ఏఐసీసీకి అందడంతో సెప్టెంబరు 3న జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. టీపీసీసీ చీఫ్‌కు మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

తెలంగాణ అధికార కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయం మరింత వేడిక్కింది. ఓవైపు మంత్రి కొండా సురేఖ వ్యవహారం అధిష్ఠానం వద్దకు చేరడం, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఢిల్లీ వెళ్తున్నారని.. అధిష్టాం నుంచి వారికి పిలుపు వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. విదేశీ పర్యటనలో ఉన్న ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్‌ సెప్టెంబర్ 1న ఢిల్లీకి తిరిగి రానున్నారని, అనంతరం తెలంగాణ వ్యవహారాలపై దృష్టి సారించనున్నారని సమాచారం.
ఢిల్లీలో సెప్టెంబర్ 3న జరగనున్న చర్చల్లో కొండా సురేఖ వ్యవహారంతోపాటు క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై కూడా కీలక నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కొండా సురేఖ వివాదానికి సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నివేదిక ఏఐసీసీకి చేరింది. దీనిపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ, సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షులను ఢిల్లీకి రప్పించడం సురేఖపై చర్యలు తీసుకోవడానికేనా? లేక మొత్తంగా క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు, పార్టీ వ్యవహారాలపై సమగ్ర చర్చ కోసమా? అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవాలన్న ప్రతిపాదనలు ముందు నుంచే ఉన్నాయి. కానీ, ఆయనకు మంత్రి పదవి ఇస్తే.. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇస్తారే అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవి ఎస్టీ, బీసీల్లో ఒకరికి దక్కవచ్చని.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు, ఇంకో మంత్రికి కూడా ఉద్వాసన ఉంటుందని, ఆ స్థానంలో మరొకరిని తీసుకుంటారనే ప్రచారంం కూడా ఉంది. ఇదే సమయంలో శాఖలను కూడా మార్చుతారని సమాచారం.

మాకో పదవి అంటున్న మరింత మంది..

ఎన్నికలకు ముందు జూపల్లి కృష్ణారావు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వారికి ఆర్థిక బలం ఉంది కాబట్టి ఎన్నికల్లో గెలిచారు. అలా ఎన్నికల్లో గెలిచిన కొత్తవారు ఈసారి కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. కానీ వారందరినీ పక్కనపెట్టి కృష్ణారావుకు.. శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. శ్రీనివాసరెడ్డి చేతిలో అత్యంత కీలకమైన రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ ఉంది. కృష్ణారావు చేతిలో ఎక్సైజ్ శాఖ ఉంది. పార్టీలు మారి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడమే కాకుండా.. చివరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా చేస్తున్న ఆరోపణలు. ఇందులో నిజం లేకపోలేదు. కాకపోతే పార్టీ భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించడం అంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాతనే పార్టీ దూకుడు పెరిగింది. వేగం పెరిగింది. ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కెసిఆర్ కొట్టిన దెబ్బలకు ఇంకొక పార్టీ అయితే లేచేది కాదు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపి ఏకంగా పోటీలో నిలపాడు. అంతేకాదు కెసిఆర్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ నే అని నిరూపించాడు. బిజెపి గులాబీ పార్టీతో కలుస్తుంది అని ప్రచారం జరుగుతున్న వేళ.. ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకొని.. విజయం సాధించేలా చేశాడు రేవంత్ రెడ్డి.అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి దక్కుతున్న గౌరవాన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారు. ఈ క్రమంలోనే తమకు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పార్టీలో వ్యక్తిగత ప్రజాస్వామ్యం కూడా అధికంగా ఉంటుంది. అందువల్లే నిత్యం పదవుల కోసం కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఇది కొత్తది కాకపోయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి.. భారతీయ జనతా పార్టీకి ఆయుధంగా మారింది. రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు కావడంతో.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతిని ఎగదోసి రేవంత్ రెడ్డిని బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అనిరుద్ రెడ్డి.. అద్దంకి దయాకర్.. ఇంకా కొంతమంది నాయకులు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. అనేక రకాలుగా లాబీయింగ్ చేపట్టారు. చివరికి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఇంకా చాలామంది నాయకులు.. పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగా రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కోరుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది ఆ నాయకులకు ఏమాత్రం లాభం చేకూర్చకపోగా.. కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనం కావడానికి కారణమవుతోంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలహీనమైపోతే.. ఇక జన్మలో తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కాకముందే కొంతమంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడమే ఇంతటి పరిస్థితికి కారణమైందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా ముంచుకుపోయింది లేదని.. ఎందుకైనా మంచిది రేవంత్ రెడ్డి వాళ్లతో మాట్లాడి.. సమస్యలు పరిష్కరిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఈ ముసలం నుంచి బయటపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.