Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

కోటప్పకొండలో వాల్మీకి సత్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి

పల్నాడు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు వాల్మీకి బోయ సంఘం విజ్ఞప్తి..

కోటప్పకొండలో వాల్మీకి సత్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి
Share Short Clip Download PDF

పల్నాడు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు వాల్మీకి బోయ సంఘం విజ్ఞప్తి..

నరసరావుపేట(రైట్స్ మీడియా): పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో వాల్మీకి సత్రం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS) నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడు బొల్లారావు (బాలు సాకి) జిల్లా కలెక్టర్, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు విజ్ఞప్తి చేశారు. వాల్మీకి జయంతి సందర్భంగా ఈ ప్రతిపాదనను వారి దృష్టికి తీసుకెళ్లి, సత్రం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడు ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు భోగ్యం ఓంకార్ ఆధ్వర్యంలో బాలు సాకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బాలు సాకి మాట్లాడుతూ,

కోటప్పకొండ క్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారని తెలిపారు. భక్తులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే లక్ష్యంతో వాల్మీకి సత్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

సత్రం ఏర్పాటుకు కోటప్పకొండ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్థలాన్ని గుర్తించి కేటాయించాలని, నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సత్రం అందుబాటులోకి వస్తే వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన భక్తులతో పాటు ఇతర యాత్రికులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు.

మహర్షి వాల్మీకి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవకు అంకితభావంతో కృషి చేయడమే తమ లక్ష్యమని బాలు సాకి తెలిపారు. భక్తుల సౌకర్యాలు, సామాజిక సేవా కార్యక్రమాల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి కోటప్పకొండలో వాల్మీకి సత్రం ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Source / reference: Bureau Chief Sk. Gouse, Palnadu District, AP.