మొక్కలు నాటడమే కాకుండా వాటి మనుగడ, సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. స్తంభాద్రి ప్రకృతి వనం (వెలుగుమట్ల) అర్బన్ పార్కులో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌తో కలిసి పాల్గొని మొక్కలు నాటారు.
మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి...
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ..
ప్రస్తుతం వన మహోత్సవ కార్యక్రమాల్లో మొక్కలు నాటడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నామని, అయితే వాటి మనుగడ, సంరక్షణపై కూడా అంతే శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. మొక్క నాటిన ప్రతి ఒక్కరూ దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అడవుల నరికివేత, పచ్చదనం తగ్గిపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని మంత్రి తెలిపారు. పసిఫిక్ మహా సముద్రం ఇంతగా వేడెక్కిన పరిస్థితి గత 150 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేదని, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.
కృష్ణా, గోదావరి, మున్నేరు నదుల్లో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చరిత్రలో బయ్యారం చెరువు నిండకపోవడం వంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, ప్రస్తుతం బయ్యారం చెరువులో కూడా నీరు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. వచ్చే ఏడాది త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
తాను ప్రజా జీవితంలోకి వచ్చిన ప్రారంభ రోజుల్లో వారానికి ఒకసారి నీటి సరఫరా జరిగేదని, ప్రస్తుతం ప్రతిరోజూ త్రాగునీరు అందించే స్థాయికి పరిస్థితులు మెరుగుపడ్డాయని మంత్రి అన్నారు. ప్రజలకు నీరు, రహదారులు, విద్యుత్, మౌళిక వసతులు కల్పించి అభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపు ఎంతో ముఖ్యమని మంత్రి తెలిపారు. పచ్చదనం పెరిగితే వర్షపాతం కూడా మెరుగుపడుతుందని అన్నారు. ఈ ఏడాది అటవీ ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఖమ్మం ప్రజలు స్తంభాద్రి స్తంభాద్రి ప్రకృతి వనం (వెలుగుమట్ల) అర్బన్ ఫారెస్ట్ వంటి పచ్చని ప్రాంతాలను కలిగి ఉండటం అదృష్టమని మంత్రి అన్నారు. పిల్లలను ఇలాంటి ప్రాంతాలకు తీసుకువచ్చి వివిధ రకాల చెట్లు, వాటి ఉపయోగాలను పరిచయం చేయాలని సూచించారు.
ప్రస్తుత తరంలో అనేక రకాల చెట్లను గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోందని, పిల్లలకు ప్రకృతి, పర్యావరణంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధిలో మంచి మార్పు సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. ప్రజల ఆరోగ్యానికి పరిసరాలు పరిశుభ్రంగా, పచ్చగా ఉండటం ఎంతో అవసరమన్నారు. చెట్లు లేకపోతే ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును ఆసుపత్రుల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఎన్ని కోట్ల రూపాయల సంపద ఉన్నా పర్యావరణం ఆరోగ్యకరంగా లేకపోతే దాని వల్ల ప్రయోజనం ఉండదని మంత్రి అన్నారు.
వన మహోత్సవ కార్యక్రమాల సమయంలో మాత్రమే మొక్కలు నాటకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ఒక అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతోనే వ్యక్తిగతంగా, సమాజంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని మంత్రి కోరారు. ప్రస్తుతం మనం చేస్తున్న పనులు భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతాయని, వారికి మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్కును పిల్లలు, వృద్ధులు, వాకర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ఆహ్లాదకరమైన రిక్రియేషన్ ప్రదేశంగా అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వృక్షప్రసాదాలు మంత్రి పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రి వెలుగుమట్ల పార్క్ ను స్తంభాద్రి ప్రకృతి వనం గా నామకరణం, లోగోను ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ అందించిన బ్యాటరీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, డిఆర్డీవో శ్రీరామ్, ఆర్డీఓ శ్రీనివాస్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.