జమ్మూకశ్మీర్ పై ఓఐసీ చేసిన అవాస్తవ, విరుద్ధమైన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్, లడఖ్ భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేస్తూ, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఓఐసీకి లేదని MEA తేల్చిచెప్పింది. పాకిస్తాన్ దుష్ప్రచారానికి వేదిక ఇవ్వడం మాని, ఉగ్రవాదాన్ని అరికట్టేలా పాక్ కు బుద్ధి చెప్పాలని హితవు పలికింది.
జమ్మూకశ్మీర్ అంశంపై ఇస్లామిక్ సహకార సంస్థ (OIC) కాంటాక్ట్ గ్రూప్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోని అభ్యంతరకర, వాస్తవ విరుద్ధమైన అంశాలను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. భారత్కు పూర్తిగా అంతర్గతమైన వ్యవహారాలపై మాట్లాడే నైతిక హక్కు గానీ, అర్హత గానీ ఓఐసీకి లేదని స్పష్టం చేసింది.