గ్రీన్ ల్యాండ్ భద్రతకు సంబంధించి అమెరికా, డెన్మార్క్, గ్రీన్ ల్యాండ్ దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది.

గ్రీన్ ల్యాండ్ భద్రతకు సంబంధించి అమెరికా, డెన్మార్క్, గ్రీన్ ల్యాండ్ దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ల్యాండ్ లో అమెరికాకు శాశ్వత ప్రాతిపదికన సైనిక స్థావరాలు, గగనతల వినియోగం, మిలిటరీ యాక్సెస్ హక్కులు లభించనున్నాయి. దీనిని 'ఇన్ఫినిట్ లైఫ్' ఒప్పందంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా అభివర్ణించారు. గ్రీన్ ల్యాండ్ కు భవిష్యత్తులో పూర్తి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటికీ, ఈ ఒప్పందం ఎటువంటి మార్పు లేకుండా శాశ్వతంగా అమల్లోనే ఉంటుందని అమెరికా అధికారులు తెలిపారు.

ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం వ్యూహాత్మక ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రీన్ ల్యాండ్ లో నాటో సభ్యులు కాని దేశాలు ఎలాంటి సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా, దళాలను మోహరించకుండా ఇది పూర్తిగా కట్టడి చేస్తుంది. మౌలిక సదుపాయాలు, సున్నితమైన జాతీయ భద్రతా రంగాల్లో శత్రు దేశాలు ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.