ఈ నెల(సెప్టెంబర్) 17వ తేదీన చిత్తారి లక్ష్మి తన కొడుకు చిత్తరీ హరిబాబు హత్యకు సంబందించిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 169/2026, U/s 103(1) r/w 3(5) BNS ప్రకారం హత్య కేసు నమోదు చేసినట్టు తెలిపారు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కొద్ది సేపటిలో నిందితుడి ని గుర్తించి టెక్నికల్ సాక్షాధారాలు , సీ సీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేపట్టడం జరిగిందని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
చిత్తారి హరిబాబు హత్య కేసులో ఏ-1 నిందితుడు గంధం సంతోష్ అరెస్టు
⏩పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడి.
గతంలో ఈ ఏడాది మార్చ్ 17 వ తేదీన తేదీన హరిబాబు భార్య గంధం వైష్ణవి హత్యకు గురైన కేసులో కోరుట్ల పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు మేరకు హరిబాబు, అతని తల్లి చిత్తారి లక్ష్మి మరియు అతని ఇద్దరు సోదరులు అరెస్ట్ కాగా కరీంనగర్ జైలుకు వెళ్లి అనంతరం బెయిల్ పై విడుదలయ్యారని చెప్పారు.. విడుదలైన తర్వాత వైష్ణవి కుటుంబ సభ్యుల నుండి ప్రాణభయం ఉందని భావించి హరిబాబు, అతని తల్లి లక్ష్మి నిజామాబాద్ కు వచ్చి సాయినగర్ లో నివసిస్తూ రాజ రాజేంద్ర చౌరస్తా సమీపంలో మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు.
వైష్ణవి హత్య జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకోని ప్రతీకార భావంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం A-1 గంధం సంతోష్ తన తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ మరియు ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నెల 17 వ తేదీన సాయంత్రం సుమారు 5 గంటలకు కోరుట్ల నుండి తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారు నంబర్ TS-36A-4843లో నిజామాబాద్ కు వచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
రాజ రాజేంద్ర చౌరస్తా సమీపంలోని గిరిరాజ్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న పానీపూరి బండి వద్ద మృతుడు హరిబాబు నీరు తీసుకుంటున్న సమయంలో A-1 గంధం సంతోష్ కారులోని కుడి వైపు వెనుక డోర్ నుండి దిగి, కత్తితో మృతుడి తల, ముఖం మరియు మెడపై పలుమార్లు దాడి చేసి అనంతరం అదే కారులో అక్కడి నుండి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు మరియు సాంకేతిక ఆధారాల ద్వారా వెల్లడైందన్నారు.
నిందితుల ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, నమ్మకమైన సమాచారం మేరకు నిజామాబాద్ ఔటర్ బైపాస్ ప్రాంతంలో A-1 గంధం సంతోష్ ఉన్నట్లు గుర్తించమన్నారు..
19వ తేది అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోవడానికి ప్రయత్నించగా అనంతరం అతడిని అదుపులోకి తీసుకోని చట్ట ప్రకారం విచారించగా, కేసుకు సంబంధించిన కీలక సమాచారం లభించిందని చెప్పారు. ఇక్కడ కారు వదిలేసి, తన అత్తగారి ఊరు విశాఖపట్నం వెళ్ళటానికి నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్ళే ప్రయత్నాల్లో ఉండగా పట్టు బడటం జరిగిందన్నారు.
విచారణలో లభించిన సమాచారం ఆధారంగా హత్యకు ఉపయోగించిన కత్తి, తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారు , అలాగే కారులో ఉన్న మరో రెండు కత్తులు మరియు రెండు కర్రలను స్వాధీనం చేసుకోవడం జరిగినట్టు చెప్పారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. ఈ కేసులో ప్రాథమికంగా నలుగురు వ్యక్తుల ప్రమేయం నిర్ధారణ కావడంతో, మిగిలిన వారి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దర్యాప్తులో ఎవరి ప్రమేయం తేలినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్టు చేయడం జరుగుతుందన్నారు.పరారీలో ఉన్న మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామాన్నారు.
హత్య జరిగిన ఒకటిన్నర రోజులోనే నేరస్తుడిని అరెస్ట్ చేయడంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రకాష్, ACP, శ్రీనివాస్ రాజ్, సీ ఐ, యాదగిరి గౌడ్, ఎస్ ఐ సిబ్బందిని అభినందిస్తూ, కోర్ట్ లో శిక్ష పడేలా ఈ కేసు ను అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.