నరసరావుపేట (రైట్స్ మీడియా): పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రతిభావంతుడైన విద్యార్థికి నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు ఆర్థిక సహాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గుంటూరులోని కిట్స్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సహర్షకు అవసరమైన రూ.30,000లను మిత్రుల సహకారంతో సమకూర్చి అందజేశారు.
నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో వినాయకుడి గుడి సమీపంలో మసాలా బండి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సురే లోకేష్ తన కుమారుడు సహర్షను ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ చదివిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సహర్ష చదువులో ప్రతిభ కనబరుస్తూ పదో తరగతిలో 565 మార్కులకు గాను 600 మార్కులు సాధించి 96.5 శాతం, ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి 99 శాతం మార్కులు పొందాడు.
ప్రస్తుతం బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సహర్షకు కళాశాల చదువుల నిమిత్తం రూ.30,000 అవసరం కావడంతో, అతని తల్లి తనకు తెలిసిన వారి ద్వారా అత్తులూరి సుబ్బారావును సంప్రదించారు. విద్యార్థి చదువుపై ఉన్న ఆసక్తి, ప్రతిభను గుర్తించిన సుబ్బారావు వెంటనే స్పందించి తన మిత్రుల సహకారంతో అవసరమైన మొత్తాన్ని సమకూర్చి అందజేశారు.
విద్య, వైద్య అవసరాలతో తనను ఆశ్రయించే వారికి తనవంతు సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్న అత్తులూరి సుబ్బారావును పలువురు అభినందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థుల చదువులు ఆగిపోకుండా సమాజంలోని దాతలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడ్డారు.