వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఘోరమైన రోడ్డుప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మల్లన్నగూడెం గ్రామానికి చెందిన గణేష్ (40) తన కుటుంబ సభ్యులతో కలిసి మొత్తం ఆరుగురు కిరాయి కారులో మేడారానికి వెళ్తుండగా, జాతీయ రహదారి 365 పై ముత్తోజిపేట గ్రామానికి చేరుకునే సరికి కారు అదుపుతప్పి వేగంగా పక్కనే ఉన్న ఓ ఇంటివైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద గణేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
గణేష్ తల్లిదండ్రులకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గణేష్ భార్య, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. కారు వేగంగా ఢీకొనడంతో అక్కడ ఉన్న ఓ ఎద్దు ఎగిరి పడినట్లు సమాచారం. ప్రమాద ధాటికి కారు బంపర్, నంబర్ ప్లేట్తోతో పాటు ఇతర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.