•కల్మషం లేని సోదర ప్రేమకు ప్రతిరూపం..
•మానవతా విలువలకు మకుటం 'రక్షాబంధనం'
రక్తసంబంధం కంటే మిన్నగా, జన్మజన్మల ప్రేమానుబంధాలను ముడివేసే అపురూప వేడుక రక్షాబంధనం.
•తోడబుట్టిన వాడు చెంత లేకపోయినా, రాఖీ కట్టిన ప్రతి సోదరికి "నీకు నేనున్నాను" అని భరోసానిచ్చే ఒక అన్న తోడుగా నిలుస్తాడు. శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే ఈ పండుగ కేవలం దారం కట్టే సంప్రదాయం మాత్రమే కాదు; జీవితాంతం తోడై ఉండే ఆత్మీయ రక్షణ కవచం.
రాఖీ.. అనుబంధానికి అక్షరాలా రక్షా కవచం!
ప్రత్యేక కథనం— మ్యాకల మహేష్, వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (రైట్స్ మీడియా):
పురాణాల్లో రాఖీ ప్రాశస్త్యం - అసలు నేపథ్యం: రక్షాబంధనం వెనుక పురాణాల్లో విశిష్టమైన గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి
• శచీదేవి - దేవేంద్రుడి కథ: దేవదానవుల మధ్య త్రిలోకాధిపత్యం కోసం భీకర యుద్ధం జరుగుతున్న వేళ, రాక్షసుల ధాటికి దేవేంద్రుడు నిస్సహాయుడయ్యాడు. అప్పుడు ఆయన సతీమణి శచీదేవి పరమేశ్వరుడిని, లక్ష్మీనారాయణులను ఆరాధించి దేవేంద్రుడి చేతికి సురక్షా కంకణం కట్టింది. ఆ శక్త్యుత్తేజంతోనే దేవేంద్రుడు యుద్ధంలో విజయం సాధించాడు. రక్షణ కట్టే ఈ సంప్రదాయమే కాలక్రమంలో రక్షాబంధనంగా మారింది.
లక్ష్మీదేవి- బలి చక్రవర్తి గాధ:
బలి చక్రవర్తి దాతృత్వానికి మెచ్చి శ్రీమహావిష్ణువు పాతాళంలోనే ఉండిపోగా, భర్తను తిరిగి వైకుంఠానికి తెచ్చుకునేందుకు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి సోదరుడిగా స్వీకరించింది. సోదర భావంతో అభ్యర్థించి విష్ణుమూర్తిని విడిపించుకుంది. అందుకే రాఖీ కట్టే సమయంలో..
• "యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః | తేన త్వామభిబధ్నామి రక్షే మా చల మా చలః"
• (మహాబలవంతుడైన బలిచక్రవర్తి ఏ రక్షణ కంకణంతో బంధించబడ్డాడో, దేనివల్లనైతే అభయం పొందాడో.. అదే రక్షను నీకు కడుతున్నాను. ఓ రక్షాబంధనమా! నీవు స్థిరంగా ఉండి ఈ సోదరుడిని కాపాడు) అనే శ్లోకాన్ని పఠిస్తారు.
ద్రౌపది- శ్రీకృష్ణుల నిర్మల బంధం:
సుదర్శన చక్రంతో శిశుపాలుడిని సంహరించే క్రమంలో శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తం కారగా, ద్రౌపది తన చీర కొంగును చింపి గాయానికి కట్టింది. ఆ ఆత్మీయతకు మురిసిన కృష్ణుడు ఆ రుణం తీర్చుకునేందుకే, కురుసభలో దుశ్శాసనుడి వస్త్రపహరణ సమయంలో 'అక్షయ వస్త్రాలు' ప్రసాదించి ద్రౌపది మానప్రాణాలను రక్షించాడు.
యమునా -యమధర్మరాజు:
సూర్య భగవానుడి సంతానమైన యముడు, యమునల సోదర బంధం అనన్యమైనది. శ్రావణ పౌర్ణమి నాడు యమున తన సోదరునికి రాఖీ కట్టి ఆయురారోగ్యాలు కోరగా, యముడు సంతోషించి ఈ రోజున రాఖీ కట్టే సోదరీసోదరులకు అపమృత్యు భయాలు తొలిగిపోతాయని అభయమిచ్చినట్లు పురాణ గాథ.
చారిత్రక ప్రాధాన్యత - రాఖీ రక్షణ శపథం: కేవలం పురాణాల్లోనే కాక భారతీయ చరిత్రలోనూ రాఖీకి గొప్ప ప్రాధాన్యం ఉంది.
రాణీ కర్ణావతి - హుమాయూన్ గాథ:* మేవాడ్ రాణి కర్ణావతి తన రాజ్యాన్ని బహుదూర్ షా దాడి నుండి కాపాడుకోవడానికి మొఘల్ చక్రవర్తి హుమాయూన్‌కు రాఖీ పంపింది. రాఖీ సందేశాన్ని అందుకున్న హుమాయూన్, ప్రజా మతాలతో సంబంధం లేకుండా సోదర ధర్మాన్ని పాటించి ఆమె రాజ్య రక్షణ కోసం తన సైన్యంతో తరలివచ్చాడు.
ఆధునిక సమాజంలో రాఖీ విశిష్టత - మానవీయ విలువల పునరుద్ధరణ:
ఒకప్పుడు అక్కాచెల్లెళ్లు ఒకే ఊరిలో కలసిమెలసి ఉండేవారు. నేడు ఉపాధి, ఉన్నత చదువుల రీత్యా ప్రపంచ నలుమూలల విస్తరించారు. ఫలితంగా కొరియర్ ద్వారా రాఖీలు పంపడం, వీడియోగ్రాఫిక్ కాలింగ్ ద్వారా పలకరించుకోవడం సర్వసాధారణమైంది. సాంకేతికత భౌతిక దూరాన్ని పెంచినా, ఆ రక్షాదారంలోని భావోద్వేగాన్ని, ప్రేమానురాగాలను మాత్రం ఏమాత్రం తగ్గించలేకపోయింది.
స్వార్థం, ఆస్తిపాస్తుల వివాదాలు పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో "నా చెల్లికి/అక్కకు నేను జీవితాంతం అండగా ఉంటాను" అనే భరోసానివ్వడం కంటే గొప్ప కానుక వేరొకటి లేదు. ఈ పండుగ సమాజంలో అడుగంటిపోతున్న మానవీయ విలువలను, పరస్పర సౌభ్రాతృత్వాన్ని పునరుద్ధరిస్తుంది.
శ్రావణ పౌర్ణమి - హయగ్రీవ జయంతి & ఉపాకర్మ: శ్రావణ పౌర్ణమి కేవలం రక్షాబంధనానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మికంగానూ ఎంతో విశిష్టమైనది.
హయగ్రీవ అవతారం:* వేదాలను అపహరించిన సోమకాసురుడిని సంహరించి, జ్ఞానాన్ని తిరిగి లోకానికి ప్రసాదించడానికి శ్రీమహావిష్ణువు 'హయగ్రీవ' (గుర్రపు ముఖం కలిగిన శ్వేత రూపం) అవతారం దాల్చిన పవిత్ర దినం ఇదే. అందుకే ఈ రోజున హయగ్రీవ జయంతిగా విద్యా ప్రాప్తి కోసం పూజలు చేస్తారు.
యజ్ఞోపవీత ధారణ (ఉపాకర్మ): వైదిక సంప్రదాయంలో ఈ పౌర్ణమి రోజున ద్విజులు 'ఉపాకర్మ' నిర్వహించి పాత జంధ్యాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
సాటి మనుషులను సోదర భావంతో చూడాలనే ఉన్నతమైన ఆకాంక్షను బలపరిచే 'రక్షాబంధనం' సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు విరజిల్లడానికి ఒక దివ్యౌషధం!