భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో అంతర్జాతీయ పాలనా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ 10 సూత్రాల కార్యాచరణను ప్రతిపాదించారు. ప్రజల శ్రేయస్సు, మానవతా దృక్పథంతో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ పాలనా వ్యవస్థలో సంస్కరణలకు మోదీ పిలుపు
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా.. భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఘనంగా ప్రారంభమైంది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత రెండు దశాబ్దాల్లో బ్రిక్స్ సాధించిన ప్రగతిని ప్రశంసించారు. ప్రస్తుత సదస్సును చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు.
ప్రపంచ ఆర్థిక, సామాజిక, దౌత్య రంగాల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బ్రిక్స్ సహకారాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిస్తూ ఈ సందర్భంగా 10 సూత్రాల కార్యాచరణను సభ్య దేశాల ముందుంచారు. భారత్ నాయకత్వంలోని బ్రిక్స్ విధానం కేవలం సభ్య దేశాల ప్రయోజనాలకే పరిమితం కాదని ప్రపంచవ్యాప్తంగా ప్రజల శ్రేయస్సు, మానవతా దృక్పథానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు అంతర్జాతీయ వేదికలపై మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
స్థితిస్థాపకత, నవకల్పన, సహకారం, సుస్థిరత ప్రధాన ప్రాధాన్యతలుగా భారత్ అధ్యక్షతన బ్రిక్స్ ముందుకు సాగుతోందని మోదీ తెలిపారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో పరస్పర సహకారం, సమన్వయం ద్వారా సభ్య దేశాలు కొత్త అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. బ్రిక్స్ సహకారాన్ని కేవలం ప్రభుత్వాల స్థాయిలోనే కాకుండా సామాన్య ప్రజల ప్రయోజనాలతో అనుసంధానించాలనే లక్ష్యంతో భారత్‌లో దాదాపు 30 నగరాల్లో 350కి పైగా సన్నాహక సమావేశాలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రధాని గుర్తుచేశారు. వివిధ రంగాల నిపుణులు, ప్రజా ప్రతినిధులు, పరిశ్రమలు, యువత, పౌర సమాజం భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ సమావేశాలు బ్రిక్స్ సహకారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు.
ప్రపంచంలో వేగంగా మారుతున్న భౌగోళిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అభివృద్ధి, సాంకేతికత, వాణిజ్యం, సుస్థిరత, ప్రజల సంక్షేమం వంటి అంశాల్లో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే సదస్సు ప్రధాన లక్ష్యంగా నిలిచింది.ప్రపంచ పాలనా వ్యవస్థలో సంస్కరణలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యం, పరస్పర సహకారంతో సుస్థిర అభివృద్ధి ఈ అంశాల చుట్టూ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత్ తన ప్రాధాన్యతలను స్పష్టంగా చాటిచెప్పింది.