జనగామ(రైట్స్ మీడియా): దేశంలో ప్రజాస్వామ్య పునాదులను కాపాడాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయిందని, ఈ అక్రమాలకు సూత్రధారి అయిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC), తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున చేపట్టిన నిరసన ర్యాలీలో ముఖ్యఅతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యెషశ్విని రెడ్డి, డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా నెహ్రూ పార్క్ వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుంది. ర్యాలీ పొడవునా కాంగ్రెస్ పార్టీ జెండాల రెపరెపలు, ప్రధాని నరేంద్ర మోడీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌లకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో జనగామ పట్టణం మారుమోగింది. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కి వినతి పత్రం అందజేశారు.