⏩ఖమ్మం నగరంలో పాత డిఆర్డీవో కార్యాలయం ఆవరణ జరుగుతున్న ఎస్ఐఆర్ హియరింగ్ ప్రక్రియ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం మ్యాపింగ్ కానీ, అనామిలిస్ జాబితాలో ఉన్న వారందరికీ నోటీసుల జారీ, డాక్యుమెంట్స్ అప్లోడ్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.
బుధవారం స్థానిక బస్ డిపో రోడ్, పాత డిఆర్డీఏ కార్యాలయ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తున్న విధులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనామిలిస్, మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను బిఎల్ఓ లు యాప్ లో నమోదు చేసే విధానాన్ని పరిశీలించారు. ప్రత్యక్షంగా హియరింగ్ కు హాజరైన ఓటర్ల తో ఎదురైన సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ,
నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత తేదీల్లో హియరింగ్ కు హాజరయి బిఎల్వోలకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై బిఎల్వోలు సరైన ప్రణాళికతో విధులు నిర్వహించాలని, నోటీసులు అందుకున్న వారిలో ఏ, బి, సి కేటగిరీల వారీగా సంబంధిత ఓటర్లతో అవసరమైన డాక్యుమెంట్లను మాత్రమే తీసుకోవాలని, కుల దృవీకరణ పత్రాలు అవసరమైన వారికి మంజూరు చేసేలా ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
అర్హులైన ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా తప్పులు లేని, పారదర్శకమైన సమగ్ర ఓటరు జాబితాను రూపొందించాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. మ్యాపింగ్ కాని, అనామిలిస్ జాబితాలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశాక, నిర్దేశిత తేదీల్లో హియరింగ్ కు హాజరయ్యేలా చూడాలన్నారు. అవసరమైన వారికి కులదృవీకరణ పత్రాలు తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. నోటీసుల జారీ, ఓటర్ల హియరింగ్, ఫారాల స్వీకరణ, అప్లోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటిపై తప్పనిసరిగా సంబంధిత ఓటర్ల సంతకాలు తీసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియను నిర్వహించాలని, విధులు కేటాయించిన సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీల సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, బిఎల్ఓ లు, ఎన్నికల సిబ్బంది, తదితరులు ఉన్నారు.