గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణలో భాగంగా అనుమానాస్పద ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ లపై ప్రత్యేక నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
మూడు నెలల కాలంలో జిల్లాలో స్కానింగ్ సెంటర్లలో చేపట్టిన తనిఖీల గురించిన వివరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుని, వాటి నివేదికలను పరిశీలించారు. అలాగే అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణలో భాగంగా అనుమానస్పద స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనుమానాస్పద ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. లింగ నిర్ధారణ కు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.50 వేల పారితోషికం ఇస్తామని తెలిపారు. అనుమతి పొందిన డాక్టర్ కాకుండా ఇతరులు స్కానింగ్ పరీక్షలు చేస్తున్నట్లుగా గుర్తిస్తే తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ రజిత ,ఎస్. బి. ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేష్, బన్ను ఎన్జీఓ నుండి శ్రీమతి నీతా,డెమో వి. అశోక్ రెడ్డి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.