పొన్నం సత్తయ్య ఆశయాలు, కుటుంబ విలువలను ముందుకు తీసుకెళ్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
⏩వ్యవసాయం, సాహిత్యం, కళారంగాల్లో విశిష్ట సేవలకు పురస్కారాలు.
⏩రైతుల హక్కుల కోసం పోరాడిన ఎం. కోదండరెడ్డి, సాహితీవేత్త వెలిచాల కొండల్ రావు, జానపద కళాకారిణి గొట్టే కనకవ్వలకు సత్కారం
వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి జీవిస్తూ కుటుంబానికి, సమాజానికి మంచి విలువలను అందించిన తన తండ్రి శ్రీ పొన్నం సత్తయ్య గారి ఆశయాలు, మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లడమే తమ కుటుంబ బాధ్యత అని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పొన్నం సత్తయ్య గౌడ్ 16వ వర్ధంతి సందర్భంగా పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్, కరీంనగర్ మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో “పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలు - 2026” కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలందించిన ఎం. కోదండరెడ్డి, సాహిత్య రంగంలో సేవలందించిన వెలిచాల కొండల్ రావు, జానపద కళారంగంలో విశేష ప్రతిభ కనబరిచిన గొట్టే కనకవ్వలకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ తదితరులు పురస్కారాలను అందజేశారు. పురస్కార గ్రహీతలకు మెమెంటోతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని అందించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
గత నాలుగు సంవత్సరాలుగా విద్య, సామాజిక, సాహిత్య, కళా తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరిస్తున్నామని తెలిపారు. “గత ఏడాది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు పొన్నం సత్తయ్య పేరు మీద వ్యవసాయ రంగంలో కూడా అవార్డు ఇస్తే బాగుంటుందని సూచించారు. ఆ సూచన మేరకు ఈ ఐదవ సంవత్సరం నుంచి వ్యవసాయ రంగాన్ని కూడా పురస్కారాల్లో చేర్చాం” అని మంత్రి తెలిపారు. రైతుల హక్కుల కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడిన ఎం. కోదండరెడ్డికి తొలి వ్యవసాయ రంగ పురస్కారాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. రైతుల పట్ల, పంటల పట్ల, వ్యవసాయం పట్ల కోదండరెడ్డికి ఉన్న ప్రేమ, అనుబంధాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారం అందిస్తున్నామని చెప్పారు.
రైతు కుటుంబం నుంచి వచ్చిన మాకు రైతు కష్టం తెలుసు
తమ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినా వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టి పిల్లలకు విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు, సమాజం పట్ల బాధ్యతను నేర్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న కుటుంబం కావడంతో రైతు కష్టం, వ్యవసాయం విలువ తమకు బాగా తెలుసన్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని వ్యవసాయ రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఉమ్మడి కుటుంబానికి పొన్నం కుటుంబం ఆదర్శం
పొన్నం సత్తయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, విలువలు, ఆశయాలు నేటికీ స్ఫూర్తిగా ఉన్నాయని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పేర్కొన్నారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ
గ్రామీణ సమాజానికి, ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంతో కీలకమన్నారు. కుటుంబంలో ఒకరికి కష్టం వస్తే మరొకరు అండగా నిలవడం మన సంస్కృతిలోని గొప్ప విలువ అని తెలిపారు. నేటి కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర సహకారం వంటి విలువలను కొత్త తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. పొన్నం సత్తయ్య జీవితం కుటుంబ విలువలు, మానవత్వం, వ్యవసాయం పట్ల నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ
పొన్నం సత్తయ్య జీవితం గొప్ప ఆదర్శమన్నారు. వ్యవసాయం చేస్తూనే తన పిల్లలకు ఉన్నత విద్య అందించి వారు జీవితంలో ఎదగాలని పొన్నం సత్తయ్య గారు కలలు కన్నారని తెలిపారు. నేడు ఆయన కుమారులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు.
పెద్ద కుమారుడు అశోక్ గౌడ్ న్యాయరంగంలో, రెండో కుమారుడు డా. పొన్నం రవిచంద్ర జర్నలిజం రంగంలో, మూడో కుమారుడు పొన్నం ప్రభాకర్ రాజకీయ రంగంలో ప్రజలకు సేవ చేస్తుండటం అభినందనీయమన్నారు. కుటుంబ సభ్యులంతా ఐక్యంగా ఉండి తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తీరు అందరికీ ఆదర్శమన్నారు.
1985 నుంచి పొన్నం ప్రభాకర్‌తో తనకు పరిచయం ఉందని, ఆయనను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించిన విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి అనేక పోరాటాలు చేశామని, లాఠీ దెబ్బలు కూడా తిన్నామని అన్నారు. పొన్నం ప్రభాకర్ తనకు రాజకీయంగా ప్రియ శిష్యుడని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర: మంత్రి వివేక్ వెంకట్ స్వామి
మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ 2009 నుంచే పొన్నం ప్రభాకర్‌తో తనకు పరిచయం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో, పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించడంలో పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. పార్లమెంట్లో ‘జై తెలంగాణ’ నినాదాన్ని బలంగా వినిపించిన నాయకుడిగా ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తుచేశారు. మంత్రి స్థాయికి ఎదిగినా పాత మిత్రులు, యూత్ కాంగ్రెస్ సహచరులను పొన్నం ప్రభాకర్ మరచిపోకుండా అందరినీ కలుపుకొని వెళ్లడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు.
సామాజిక న్యాయం కోసం పొన్నం ప్రభాకర్ కృషి అభినందనీయం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పొన్నం కుటుంబంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. పొన్నం ప్రభాకర్ అందరినీ ప్రేమ, ఆప్యాయతలతో పలకరిస్తూ కార్యకర్తలు, నాయకులను సోదరభావంతో కలుపుకుని వెళ్తున్నారని తెలిపారు. పొన్నం సత్తయ్య గారు పేదలు, బలహీన వర్గాల పట్ల చూపిన శ్రద్ధను పొన్నం ప్రభాకర్ కొనసాగిస్తున్నారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద, బలహీన వర్గాల సంక్షేమం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విద్య, శిక్షణ, ఉన్నత అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఆయన కృషి తోడ్పడుతోందన్నారు.
పురస్కారాలు ప్రతిభను ప్రోత్సహించాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పొన్నం సత్తయ్య పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పించారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆలోచనలు, విలువలు నేటికీ సమాజానికి స్ఫూర్తిగా ఉన్నాయని అన్నారు. బలమైన కుటుంబ వ్యవస్థే బలమైన సమాజానికి పునాది అని, కుటుంబాల్లో ప్రేమ, గౌరవం, పరస్పర సహకారం పెరిగితే సమాజంలో శాంతి, సామరస్యం పెరుగుతాయని తెలిపారు. పొన్నం కుటుంబం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆదర్శంగా నిలుస్తోందని, కుటుంబ విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతిభను గుర్తించడం సమాజ బాధ్యత: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల ద్వారా వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న వారిని గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పురస్కారం విలువ కంటే దాని ద్వారా సమాజానికి అందే సందేశం గొప్పదన్నారు. సరైన సమయంలో సరైన అవకాశం లభిస్తే మట్టిలో దాగి ఉన్న ప్రతిభలు మాణిక్యాలుగా వెలుగులోకి వస్తాయని చెప్పారు. జానపద కళారంగంలో విశేష సేవలు అందిస్తున్న కళాకారిణి గొట్టే కనకవ్వను సత్కరించడం ద్వారా కళారంగాన్ని ప్రోత్సహించే మంచి సందేశాన్ని ఈ కార్యక్రమం ఇచ్చిందన్నారు.
పురస్కారాల ఎంపికకు ప్రత్యేక జ్యూరీ
పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీని డా. పొన్నం రవిచంద్ర కన్వీనర్‌గా వ్యవహరించారు.
కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, ప్రముఖ పాత్రికేయులు దిలీప్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డైరెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి జ్యూరీ సభ్యులుగా వ్యవహరించి పురస్కార గ్రహీతలను ఎంపిక చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య,నవీన్ యాదవ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమాయాదేవి, అధికారులు, ప్రజాప్రతినిధులు, పొన్నం కుటుంబ సభ్యులు, అభిమానులు, సాహిత్య, కళా, వ్యవసాయ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.