హనుమకొండ (రైట్స్ మీడియా): జిల్లాలో అగ్రిస్టాక్ కమిటీ ఏర్పాటు ద్వారా రైతులకు నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు ఈ నూతన టెక్నాలజీ ఉపయోగపడుతుందని
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలు లో అగ్రి స్టాక్ టెక్నాలజీ విధానంపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కోసం వ్యవసాయ, భూములు కొలతలు, పశు సంవర్ధక, ఉద్యాన, సహకార, నాబార్డ్, పౌర సరఫరాలు, తదితర శాఖల అధికారులతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఛైర్ పర్సన్ గా, కన్వీనర్ గా జిల్లా వ్యవసాయ అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటయింది.
ఈ సమావేశంలో నూతన టెక్నాలజీ అగ్రిస్టాక్ ద్వారా రైతులకు నాణ్యమైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు, పథకాలను అందించేందుకు నూతన టెక్నాలజీని తీసుకురావడానికి, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో మార్పులు తెచ్చేందుకు పలు సూచనలు చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, బ్యాంకు సేవలు, మార్కెటింగ్ సదుపాయాలు, పంట కొనుగోలును ఒకేతాటిపైకి తీసుకువచ్చి రైతులకు వేగవంతమైన సేవలను అందించడం అగ్రి స్టాక్ టెక్నాలజీ ప్రధాన ఉద్దేశమని అధికారులకు వివరించారు.