ముందస్తు పరీక్ష.. ముందస్తు గుర్తింపు.. సకాలంలో చికిత్స.. ఆరోగ్యకరమైన జీవనకాలానికి ఇదే మార్గం.
260 మందిలో వివిధ రకాల క్యాన్సర్ గుర్తింపు.. చికిత్స, రిఫరల్, ఫాలోఅప్‌తో నిరంతర పర్యవేక్షణ.
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ నిరంతర పర్యవేక్షణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు.
మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పిల్లల సంరక్షణ, ఇంటి బాధ్యతల్లో నిత్యం నిమగ్నమయ్యే మహిళలు చాలా సార్లు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మరిచిపోతుంటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేస్తూ.. తీవ్రమైన సమస్యగా మారిన తర్వాత ఆసుపత్రిని ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే సకాలంలో చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమం ఖమ్మం జిల్లాలో మహిళల ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తున్నది.
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పర్యవేక్షణలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సర్వజన aasupathrilo ప్రభుత్వ వైద్య విభాగం సమర్థవంతంగా అమలు చేస్తున్నది. జిల్లాలోని సర్వజన ఆసుపత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం, గురువారం నిపుణులైన మహిళా వైద్యులచే మహిళలకు ప్రత్యేకంగా ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఓపీ నమోదు నుంచి స్క్రీనింగ్, పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, అవసరమైన ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫరల్, చికిత్స అనంతరం ఫాలో అప్ వరకు సేవలను అనుసంధానం చేస్తున్నారు.
ఇంటి దగ్గర్లోనే.. సమగ్ర ఆరోగ్య పరీక్షలు:
మహిళలు తమ ఆరోగ్య సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ వైద్య కేంద్రాల్లోనే ఆరోగ్య మహిళ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఓపీ నమోదు, ఆన్లైన్ డేటా నమోదు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరాన్ని బట్టి వివిధ రకాల అధునాతన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 35 సంవత్సరాలు పైబడిన మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
మామోగ్రామ్, పాప్‌స్మియర్, రక్త పరీక్షలు, ఉదర భాగం అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే, ఈసీజీ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. రొమ్ములో గడ్డలు వంటి అనుమానాస్పద లక్షణాలను గుర్తించడంతో పాటు అవసరమైన వారికి ఎఫ్ఎన్ఏసీ, కాల్పోస్కోపీ, సర్వైకల్, ఎండోమెట్రియల్ బయాప్సీ వంటి తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కుటుంబ నియంత్రణ సేవలు, శస్త్రచికిత్స ఓపీ సేవలు, తదితర సేవలు కూడా అందిస్తున్నారు.
లక్షణాలు వచ్చే వరకు ఎందుకు ఆగాలి?:
క్యాన్సర్ అంటే భయపడటం కాదు.. ముందుగానే గుర్తించడం ముఖ్యం. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరుచుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఉద్దేశ్యంతో ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ముందస్తు స్క్రీనింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మామోగ్రామ్, పాప్‌స్మియర్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షల్లో ఏదైనా అనుమానాస్పద ఫలితం వస్తే అక్కడితో వదిలేయకుండా తదుపరి పరీక్షలకు పంపిస్తున్నారు. అవసరమైన చోట బయాప్సీ, ఎఫ్ఎన్ఏసీ, కాల్పోస్కోపీ వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. నిర్ధారణ అయిన కేసులకు అవసరమైన చికిత్స కోసం హైదరాబాద్‌తో పాటు ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేస్తున్నారు.
49 వేలకు పైగా ఓపీ సేవలు:
ఖమ్మం సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. నరేందర్ నిరంతర పర్యవేక్షణ చేస్తూ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా అందుతున్న సేవల గణాంకాలే నిదర్శనం. 2023 మార్చి 8 నుంచి 2026 ఆగస్టు 31 వరకు 49,202 ఓపీ సేవలు నమోదయ్యాయి. ఈ కాలంలో 4,900 పాప్‌స్మియర్ పరీక్షలు నిర్వహించగా, 264 కేసుల్లో అసాధారణ ఫలితాలు గుర్తించారు. అలాగే 6,102 మామోగ్రామ్ పరీక్షలు నిర్వహించగా, 973 కేసుల్లో అసాధారణ ఫలితాలు నమోదయ్యాయి.
ఉదర భాగానికి సంబంధించిన సమస్యలను గుర్తించేందుకు 9,149 అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 2,872 కేసుల్లో అసాధారణ ఫలితాలు గుర్తించబడ్డాయి. అనుమానాస్పద ఫలితాలను నిర్లక్ష్యం చేయకుండా తదుపరి వైద్య పరీక్షలకు అనుసంధానం చేయడం ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది.
పరీక్షలతో ఆగలేదు.. నిర్ధారణ వరకు తీసుకెళ్లారు:
ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రత్యేకత కేవలం స్క్రీనింగ్ నిర్వహించడంలోనే లేదు. పరీక్షల్లో అనుమానాస్పద ఫలితాలు వచ్చిన మహిళలను తదుపరి స్థాయి పరీక్షలు, వైద్య సేవలకు అనుసంధానం చేస్తున్నారు. ఎఫ్ఎన్ఏసీ, కాల్పోస్కోపీ, బయాప్సీ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాల్పోస్కోపీ ద్వారా 245 మందికి సేవలు అందించగా, క్రయోథెరపీ సేవలు 22 మందికి అందించారు. ఇలా ఒక మహిళ ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి పరీక్షలు నిర్వహించడం, అనుమానిత కేసును గుర్తించడం, వ్యాధిని నిర్ధారించడం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రానికి పంపించడం, చికిత్స అనంతరం పర్యవేక్షించడం వరకు ఒక సమగ్ర వైద్య వ్యవస్థగా కార్యక్రమం కొనసాగుతున్నది.
260 మందిలో క్యాన్సర్ గుర్తింపు:
ముందస్తు స్క్రీనింగ్ ఎంత కీలకమో ఖమ్మం జిల్లాలో నమోదైన ఫలితాలు తెలియజేస్తున్నాయి. 2023 మార్చి 8 నుంచి ఇప్పటివరకు ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మొత్తం 260 మందిలో వివిధ రకాల క్యాన్సర్ లేదా క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాధులు గుర్తించారు. వీరిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 95 మంది, ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా 165 మంది గుర్తించబడ్డారు.
గుర్తించిన కేసుల్లో అత్యధికంగా 109 మందిలో రొమ్ము క్యాన్సర్, 82 మందిలో సర్వైకల్ క్యాన్సర్ బయటపడ్డాయి. వీటితో పాటు నోటి క్యాన్సర్, ఉదర భాగానికి సంబంధించిన క్యాన్సర్, అండాశయ మాలిగ్నెన్సీ, జీఈ జంక్షన్ క్యాన్సర్, రెక్టం క్యాన్సర్, ఎండోమెట్రియం క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, కాలేయం, నాలుక, ఎముకలు, ఊపిరితిత్తులు, మూత్రాశయం, గొంతు తదితర ప్రాంతాలకు సంబంధించిన క్యాన్సర్ కేసులు కూడా గుర్తించారు.
థైరాయిడ్‌కు సంబంధించిన కేసుల్లో 19 మందిలో క్యాన్సర్ గుర్తించగా, ఫోలిక్యులర్ నియోప్లాజం, పాపిల్లరీ కార్సినోమా వంటి కేసులు కూడా గుర్తించారు. అండాశయ మాలిగ్నెన్సీ, ఇంగ్వైనల్ లింఫ్ నోడ్, సాఫ్ట్ టిష్యూ సార్కోమా, మెటాస్టాసిస్, సర్వైకల్ లింఫ్ నోడ్, వెర్రుకస్ లోయర్ లిప్ వంటి అరుదైన కేసులను కూడా వైద్య బృందాలు గుర్తించాయి. ఎడమ అడ్నెక్సల్ ప్రాంతంలో 7.9 సెంటీమీటర్ల × 6 సెంటీమీటర్ల పరిమాణంలో గాయం గుర్తించిన కేసును కూడా తదుపరి వైద్య సేవలకు అనుసంధానం చేశారు.
ఒక్కో కేసుపై ప్రత్యేక శ్రద్ధ:
క్యాన్సర్ నిర్ధారణతో వైద్య సేవలు ముగియడం లేదు. గుర్తించిన ప్రతి కేసును అవసరమైన చికిత్స కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మెరుగైన చికిత్స అవసరమైన వారికి అక్కడి వైద్యసేవలను పొందేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. చికిత్స అనంతరం తిరిగి ఫాలో అప్ చేయడం ద్వారా బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు పొందుతున్న 260 మంది బాధితులకు క్రమం తప్పకుండా ఫాలోఅప్ సేవలు నిర్వహిస్తున్నారు. చికిత్సలో ఉన్న మహిళలకు అవసరమైన వైద్య సలహాలు, పర్యవేక్షణ అందిస్తూ చికిత్స కొనసాగింపునకు సహకరిస్తున్నారు.
పొరుగు జిల్లాల నుంచి వచ్చినా.. సేవల్లో వెనుకడుగు లేదు:
ఖమ్మం ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి మరో నిదర్శనం చుట్టు పక్కల ప్రాంతాలు, పొరుగు జిల్లాల నుంచి కూడా మహిళలు వైద్యం కోసం రావడం. రోగుల సంఖ్య పెరగడంతో పని భారం పెరుగుతున్నప్పటికీ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్న వనరులతో సేవలను కొనసాగిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా సేవలను అందించేందుకు వైద్య బృందాలు సిద్ధంగా ఉంటున్నాయి. వచ్చిన ప్రతి మహిళకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, అనుమానాస్పద కేసులను గుర్తించి, తదుపరి వైద్య సేవలకు అనుసంధానం చేయడంపై దృష్టి సారిస్తున్నారు.
కలెక్టర్ పర్యవేక్షణలో.. మరింత చేరువగా ప్రభుత్వ వైద్యం:
జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ పర్యవేక్షణలో జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించడంపై ప్రత్యేక దృష్టి కొనసాగుతున్నది. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో స్క్రీనింగ్ సేవలు సక్రమంగా అందేలా చూడటంతో పాటు, గుర్తించిన కేసులకు తదుపరి వైద్య సేవలు అందడం, అవసరమైన వారికి ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫరల్, చికిత్స అనంతరం ఫాలోఅప్ వంటి అంశాలపై వైద్య విభాగంతో సమన్వయం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ఆరోగ్య అవగాహన పెంపొందించడం కూడా కార్యక్రమంలో ముఖ్య భాగంగా కొనసాగుతోంది.
మీ ఆరోగ్యం కోసం రెండు రోజులు.. మర్చిపోవద్దు:
మహిళలు తమ ఆరోగ్య సమస్యలను దాచుకోవడం లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి వచ్చే పరిస్థితి మారాలి. ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోయినా, ముఖ్యంగా 35 సంవత్సరాలు పైబడిన మహిళలు ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం. ప్రతి మంగళవారం, గురువారం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆరోగ్య మహిళ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షల కోసం కేటాయించే కొద్ది సమయం భవిష్యత్తులో ఎదురయ్యే పెద్ద ఆరోగ్య సమస్యను ముందుగానే గుర్తించేందుకు ఎంతో విలువైనదిగా మారవచ్చు.
ఆరోగ్య మహిళ.. ప్రతి మహిళకు ఒక అవకాశం:
కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసే మహిళ.. తన ఆరోగ్యం కోసం కూడా కొంత సమయం కేటాయించాలి. “నాకు ఏమీ లేదు” అని భావించడం కంటే “ఒక్కసారి పరీక్ష చేయించుకుందాం” అనే ఆలోచన ఎంతో ముఖ్యం. ఒక సాధారణ పరీక్షలోనే దాగి ఉన్న వ్యాధి బయటపడే అవకాశం ఉంది. ముందే గుర్తిస్తే సకాలంలో చికిత్స పొందే అవకాశం కూడా ఉంటుంది.
అందుకే ప్రతి మహిళకు ఒక విజ్ఞప్తి — ఆరోగ్యాన్ని వాయిదా వేయకండి.. పరీక్షలను నిర్లక్ష్యం చేయకండి. ప్రతి మంగళవారం, గురువారం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఆరోగ్యం కోసం మీరు వేసే ఒక్క అడుగు.. మీ కుటుంబ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుంది.