ప్రస్తుతం స్లాబ్ నిర్మాణాలు పూర్తి.. నవంబర్ లో రాతి నిర్మాణాలకు శ్రీకారం: రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం(రైట్స్ మీడియా): ప్రస్తుతం భద్రాచల దేవస్థాన అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇదే స్పీడుతో ముందుకెళితే గోదావరి పుష్కరాలకు పది రోజుల ముందే భద్రాద్రి దేవస్థానం సిద్ధమవుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
గురువారం ఆయన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్ లతో కలిసి దమ్మక్క అన్నదాన సత్రం నుంచి మెట్ల దారి వరకు.. దేవస్థానం చుట్టూ కలియతిరిగి నేరుగా పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..
బాసర నుంచి భద్రాద్రి వరకు టెంపుల్ రూట్ కావాలనే లక్ష్యంతో భద్రాచల దేవస్థానాన్ని మహాద్భుతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గత శ్రీరామ నవమి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇప్పటికే తాను మూడుసార్లు ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించానని, ప్రస్తుతం వేగంగా కొనసాగుతూ స్లాబులు పూర్తయ్యాయని, నవంబర్ మొదటివారం తర్వాత రాతి నిర్మాణ పనులు చేపడతామని అన్నారు.
భద్రాచలం పట్టణంలో వరద ముప్పు లేకుండా చూస్తాం
ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతివారం జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్ అండ్ బి, దేవాదాయ శాఖ అధికారులు సమీక్ష నిర్వహిస్తూ మంచి పురోగతి సాధిస్తున్నారని అధికారులను మంత్రి అభినందించారు.
వర్షాకాలంలో గోదావరి ఉధృతి సమయంలో భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా చూడాలని భద్రాచలం ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారని, దీంతో యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఈసారి గోదావరి పుష్కరాలకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఇందుకు తగ్గట్టుగా ఘాట్లను సిద్ధం చేస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు చేపడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.