మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడంతో పాటు, వారిని భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇచ్ఛాపురం నుంచి ‘రైజ్ గ్లోబల్ క్యాంపస్’కు శ్రీకారం చుట్టారు. శాంకరి ఎడ్యుకేషనల్ సొసైటీ (SES) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న రైజ్ గ్లోబల్ క్యాంపస్ లోగోను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆవిష్కరించారు.
మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..
మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రైవేట్ విద్యాసంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాల పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వివిధ నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ..
శ్రీకాకుళం జిల్లా వంటి ప్రాంతాల్లో విద్యారంగంలో వినూత్న ఆలోచనలతో డా. ప్రవీణ్ పుల్లట ముందుకు రావడం సంతోషకరమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా భవిష్యత్లో సమర్థులైన నాయకులను తీర్చిదిద్దవచ్చన్నారు.
కార్యక్రమంలో రైజ్ సంస్థల అధినేత, శాంకరి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డా. ప్రవీణ్ పుల్లట, తదితరులు పాల్గొన్నారు.