హనుమకొండ కుడా కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ & వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, జిడబ్ల్యుఎంసీ కమిషనర్ వెంకన్న, ఇతర అధికారులు సమావేశమయ్యారు.
వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం
నగర అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చ
వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం అహ్లువాలియా ఖనిజో, అపూర్వ సెన్వి, నేహా ప్రవాస్ కుమార్ మిశ్రా, వెంకటరావు భయాన సమావేశమయ్యారు. గురువారం హనుమకొండ లోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ,వరంగల్ జిల్లాలో కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తేజావత్ వెంకన్న, ఇతర అధికారులు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్న ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు పర్యటించారు. ఈ సమావేశంలో వరంగల్ నగరంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల ప్రాజెక్టు వివరాలపై చర్చించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు కలెక్టర్లు, అధికారులు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 300 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణ ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించగా, ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా రుణానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో జిల్లాలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరాభివృద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణం కింద చేపట్టేందుకు అర్హత కలిగిన ప్రాజెక్టులు, ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏ విధంగా ఉండాలి, డీపీఆర్‌లను ఏ గడువులోగా సమర్పించాలి, తదితర అంశాలపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్లు, అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ఈ రుణ సహాయంలో 70 శాతం ప్రపంచ బ్యాంకు రుణంగా, మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉండే విధంగా ప్రతిపాదన రూపొందించినట్లు అధికారులు వివరించారు. వరంగల్ నగరానికి ప్రతిపాదించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే సిద్ధంగా ఉన్న పలు అభివృద్ధి ప్రతిపాదనలను ప్రపంచ బ్యాంకు బృందానికి అధికారులు వివరించారు. ఇందులో ముఖ్యంగా అశోక జంక్షన్, భద్రకాళి ఆలయం ప్రాంతాల్లో మల్టీ లెవల్ కారు పార్కింగ్, సెంట్రల్ ప్లాజా పునర్నిర్మాణ పనులు, రోప్‌వే, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి, సమగ్ర స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇప్పటికే డీపీఆర్ సిద్ధంగా ఉండి, టెండర్లు పూర్తయి అవార్డు దశకు చేరుకున్న ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత లభించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. అదేవిధంగా రెండో దశలో డీపీఆర్‌లు సిద్ధమవుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను సమర్పిస్తే, వాటిని పరిశీలించి అర్హత ఆధారంగా రుణ సహాయానికి పరిగణించే అవకాశం ఉందని బృందం ప్రతినిధులు వివరించారు.
వరంగల్ నగరవ్యాప్తంగా సమగ్ర స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నందున, ఈ ప్రాజెక్టును మొదటి దశలోనే ప్రపంచ బ్యాంకు రుణ సహాయానికి ప్రతిపాదించే అవకాశం ఉందని, మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరితగతిన సిద్ధం చేసి తదుపరి దశలో సమర్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు.
దీనిపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం స్పందిస్తూ వరంగల్ చారిత్రక, వారసత్వ ప్రాధాన్యత కలిగిన నగరంగా ఉన్నందున హెరిటేజ్, పర్యాటక రంగాల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నగరంలోని చారిత్రక ప్రాంతాలను పరిరక్షిస్తూ పర్యాటక, మౌలిక వసతులను అభివృద్ధి చేసే విధంగా ప్రాజెక్టులను రూపొందించాలని సూచించారు. హెరిటేజ్ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టనున్న పనులు, వాటిలో చేర్చాల్సిన వివిధ అంశాలపై కూడా ప్రపంచ బ్యాంకు బృందం ప్రతినిధులు అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిపాదనలు, డీపీఆర్‌లను సిద్ధం చేసి సమర్పించడం ద్వారా వరంగల్ నగరంలో మౌలిక వసతులు, రవాణా, డ్రైనేజీ, పర్యాటకం, హెరిటేజ్ పరిరక్షణ, పట్టణ సుందరీకరణ తదితర రంగాల్లో సమగ్ర అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఇతర అధికారులతో పాటు కన్సల్టెంట్ ప్రతినిధి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.