నల్లబెల్లి (రైట్స్ మీడియా): మండలంలోని రంగాపురం గ్రామపంచాయతీలో వీబీజీ రామ్‌జీ ప్రత్యేక గ్రామసభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో గ్రామాభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
రంగాపురంలో ఘనంగా వీబీజీ రామ్‌జీ ప్రత్యేక గ్రామసభ
ఈ సందర్భంగా సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు మాట్లాడుతూ ..
గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గ్రామసభ అనంతరం రంగాపురం ప్రభుత్వ పాఠశాలలో రూఫ్‌టాప్ రీచార్జ్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షపు నీటిని వృథాగా బయటకు వెళ్లకుండా రూఫ్‌టాప్ రీచార్జ్ విధానం ద్వారా భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించేలా చర్యలు చేపడితే భూగర్భ జలమట్టాలను పెంపొందించుకోవడంతో పాటు భవిష్యత్‌లో నీటి సమస్యలను కొంతవరకు తగ్గించుకోవచ్చని సర్పంచ్ తెలిపారు. వర్షపు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలంగా మార్చుకోవాలి. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో గ్రామ ప్రజలంతా భాగస్వాములై రంగాపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని సర్పంచ్ కోరారు.
గ్రామసభలో ఉపసర్పంచ్ కస్తూరోజు రామ్మూర్తి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మేడిపల్లి రామారావు, ఫీల్డ్ అసిస్టెంట్ తోటకూర సుమన్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.