పల్నాడు (రైట్స్ మీడియా): వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు క్రీడా రంగంలో మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. బాపట్ల జిల్లాలోని ఖాజీపాలెంలో నిర్వహించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల 10 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ పరుగు పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించి కళాశాలకు కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చారు. యూనివర్సిటీ పరిధిలోని 11 కళాశాలలకు చెందిన 132 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
ఈ పోటీల్లో వాగ్దేవి డిగ్రీ కళాశాలకు చెందిన బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కె. రఘువేంద్ర ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకోగా, వి. లక్ష్మణ్ ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్‌ను దక్కించుకున్నారు. వీరిద్దరూ అద్భుత ప్రతిభ కనబరిచి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు.
ఈ విజయంతో ఎంపికైన కె. రఘువేంద్ర, వి. లక్ష్మణ్ నవంబర్ 11 నుంచి 15 వరకు మంగళూరులో నిర్వహించనున్న ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొననున్నారు.
విద్యార్థులు సాధించిన విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ కె. రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలను అభినందించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ, జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల విజయానికి కృషి చేసిన క్రీడా విభాగం అధికారి డా. రాజమర్సీన్ బాబు, కృష్ణంరాజు, అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ కాట్ల రామకోటేశ్వరరావు, డైరెక్టర్లు ఓగూరి నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సూదా సురేష్ బాబు, పాశం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణకిషోర్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.