వర్ధన్నపేట (రైట్స్ మీడియా): గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్న ఇద్దరు యువకులను వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
ఈ మేరకు వర్ధన్నపేట ఎస్ హెచ్ ఓ ఎన్ సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం ముత్యాల శ్యామ్, గ్రామం కాట్ర్యాల, పిన్నింటి భరత్, వర్ధన్నపేట పట్టణం. నిందితులిద్దరు గత 2-3 సంవత్సరాలుగా కలిసి గంజాయి అమ్ముతూ, సేవిస్తున్నారు. 10 రోజుల క్రితం ముత్యాల శ్యామ్ హైదరాబాద్ నుండి వైజాగ్ అరకులోని తన పాత స్నేహితుడు సుభాష్ వద్దకు వెళ్లి ఒక ప్యాకెట్ ఎండు గంజాయిని ట్రైన్ లో కాజీపేట వరకు తీసుకువచ్చి, అక్కడి నుండి కాట్ర్యాలలోని తన ఇంట్లో దాచాడు. అప్పటి నుండి ప్రతిరోజూ శ్యామ్, భరత్ తో పాటు వర్ధన్నపేటకు చెందిన మరికొంత మంది గంజాయి సేవిస్తున్నారు. ఈ క్రమంలో ఆ గంజాయిని వర్ధన్నపేటలో తన స్నేహితులకు అమ్మడానికి శ్యామ్, భరత్ ఇద్దరు కలిసి కాట్ర్యాల గ్రామ ఆటో స్టాండ్ నుండి ఆటోలో వర్ధన్నపేటకు వస్తుండగా, ఇల్లంద గ్రామ శివారు వ్యవసాయ మార్కెట్ వద్ద వర్ధన్నపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుండి సుమారు 1 కిలో ఎండు గంజాయి (విలువ రూ.50,000) నిందితుడు భరత్ కమ్యూనికేషన్ కొరకు ఉపయోగిస్తున్న Jio Bharat కీప్యాడ్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై సాయిబాబు మాట్లాడుతూ... వర్ధన్నపేట మండల పరిధిలో ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు తరలించినా, అమ్మినా, సేవించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో SI ఎం రాజు, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, సాగర్ పాల్గొన్నారు.